'OMG 2' OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ఓ మై గాడ్ 2'- అన్ కట్ వెర్షన్ అలరించేనా?
అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓ మై గాడ్ 2' చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. నెట్ ఫిక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఓటీటీలో అన్ కట్ వెర్షన్ లో రిలీజ్ కాబోతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలు గత కొంత కాలంగా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేకపోతున్నాయి. ఇటీవల ఆయన నటించిన 'ఓ మై గాడ్ 2' చిత్రం ఫర్వాలేదు అనిపించింది. ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను బాగానే అలరించింది. అమిత్ రాయ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన 8 వారాలకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాకి అందుబాటులో రాబోతోంది. అక్టోబర్ 8న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
వివాదాలకు కేరాఫ్ గా 'ఓ మై గాడ్ 2'
అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించిన 'ఓ మై గాడ్ 2' బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుని ఫర్వాలేదనిపించింది. అయితే, విడుదలకు ముందునుంచే పలు వివాదాలకు కేరాఫ్ గా నిలిచింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి 'A' సర్టిఫికెట్ జారీ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో అభ్యంతర సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ సభ్యులు చాలా సీన్స్ తొలగించారు. 27 కట్స్ తో పాటు 25 మార్పులు సూచించారు. సెన్సార్ బోర్డు నిర్ణయంపై చిత్రబృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఓటీటీలో అన్ కట్ వెర్షన్ రిలీజ్
'ఓ మై గాడ్ 2' సినిమాకి 'A' సర్టిఫికెట్ జారీ చేయడం తనను ఎంతగానో బాధించిందని ఈ చిత్ర దర్శకుడు అమిత్ రాయ్ వెల్లడించారు. ఓటీటీలో మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా అన్ కట్ వెర్షన్ ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. “ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని భావించాం. కానీ, సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేయడం చాలా బాధ కలిగించింది. U/A సర్టిఫికెట్ ఇవ్వమని సెన్సార్ టీమ్ ను చాలా రిక్వెస్ట్ చేశాం. కానీ వాళ్లు వినలేదు. సెన్సార్ బోర్డు చెప్పిన మార్పులతోనే ఈ చిత్రం విడుదల చేశాం. మా సినిమాను జనాలు ఆదరించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఈ సినిమాలో రియాలిటీ గురించి వివరించే ప్రయత్నం చేశాం. మేం చెప్పాలి అనుకున్న విషయాన్ని ఓటీటీలో ఎటువంటి మార్పులు లేకుండా చెప్పబోతున్నాం. అన్ కట్ వెర్షన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం” అని వెల్లడించారు.
‘OMG’ సీక్వెల్ గా ‘OMG 2’
అక్షయ్ కుమార్ 2012లో నటించిన ‘OMG’ సినిమాకు సీక్వెల్ గా ‘OMG 2’ వచ్చింది. ‘OMG’ ఒక సెటైరికల్ కామెడీ డ్రామా మూవీ. ఈ మూవీలో అక్షయ్ కృష్ణుడిలా కనిపించి మెప్పించారు. ఈ సినిమా వచ్చి దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ తో పాటు పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్ పోషించారు. కొడుకు కోసం పోరాడే తండ్రి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. హీరోయిన్ యామి గౌతమ్ కూడా లాయర్ పాత్రలో ఆకట్టుకుంది. మొత్తం మీద సెన్సార్ కట్స్ తో థియేటర్స్ లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్న 'ఓ మై గాడ్ 2' ఇప్పుడు అన్ కట్ వెర్షన్ తో ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.
We’ve got great news for you, and OMG can you tell we’re 2 excited? #OMG2 arrives 8 October, on Netflix! pic.twitter.com/1XLpd1sVej
— Netflix India (@NetflixIndia) October 3, 2023
Read Also: 'నా సామిరంగ' రిలీజ్ డేట్ ఫిక్స్ - నాగార్జున సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial