Naa Saami Ranga Release Date : 'నా సామిరంగ' రిలీజ్ డేట్ ఫిక్స్ - నాగార్జున సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
అక్కినేని నాగార్జున, విజయ్ బిన్నీ కాంబోలో ‘నా సామిరంగ’ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
'ది ఘోస్ట్' సినిమా ప్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నాగార్జున, ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘నా సామిరంగ’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. శరవేగంగా ఈ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.
సంక్రాంతి కానుకగా 'నా సామిరంగ' విడుదల
ఈ సినిమా విడుదలకు సంబంధించి నిర్మాణ సంస్థ ఓ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుందట. ఇప్పటికే నాగ్, అతడి టీమ్ ఈ సినిమాను జనవరి 14, 2024న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగార్జున సినిమాలు గత కొంతకాలంగా సంక్రాంతి బరిలో నిలస్తూ, చక్కటి విజయాలను అందుకుంటున్నాయి. ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’లాంటి సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు 'నా సామిరంగ'ను కూడా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాతో విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారట. ప్రస్తుతం నాగార్జున లిస్టులో మరికొన్ని కథలు ఉన్నా, ఈ సినిమాను ముందుగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. ఎక్కువలో ఎక్కువ రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని దర్శకుడు బిన్నీ ప్రయత్నిస్తున్నారు. అటు ‘ది ఘోస్ట్’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాగార్జున, ఈ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
మలయాళ మూవీ ఆధారంగా రూపొందుతున్న ‘నా సామిరంగ’
మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న 'పోరింజు మారియం జోసే' అనే సినిమా ఆధారంగా ‘నా సామిరంగ’ సినిమాను తెరకెక్కిస్తున్నారట. మూలకథ మారకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కథలో మార్పులు చేస్తున్నారట. ఇక ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. స్టంట్ మాస్టర్ వెంకట్ ఈ యాక్షన్ సీన్లను డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున గతంలో ఎప్పుడూ లేని విధంగా ఊరమాస్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది.
ఆకట్టుకున్న ఫస్ట్ లుక్, గ్లింప్స్
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున ఊర మాస్ లుక్ లో కనిపించారు. పగిలిన బల్డ్ ఫిలమెంట్ తో బీడీ కాల్చుకుంటూ రఫ్ లుక్ తో దర్శనం ఇచ్చాడు. ఈసారి పండక్కి ‘నా సామిరంగ’ అంటూ గర్జిస్తాడు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా ఓకే అయినట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also: స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు- 'మ్యాడ్' ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial