Prabhas: మరోసారి గొప్పమనసు చాటుకున్న ప్రభాస్, వయనాడ్ బాధితులకు భారీగా ఆర్థికసాయం
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వయనాడ్ బాధితులకు భారీగా ఆర్థికసాయం చేశారు. కేరళ సీఎం సహాయ నిధికి రూ. 2 కోట్లు విరాళం అందించారు.
Actor prabhas Donated Rs 2 Crore To Wayanad victims: కేరళలోని వయనాడ్ లో వరదలు విలయ తాండవం చేశాయి. భారీ వరదలకు తోడు ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అర్థరాత్రి నిద్రలో ఉన్నవారిపై కొండచరియలు కూలడంతో చాలా మంది నిద్రలోనే అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ దారుణ పరిస్థితులపై దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వయనాడ్ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. పలువురు సినిమా తారలు వయనాడ్ భాదితులకు పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు.
వయనాడ్ బాధితులకు ప్రభాస్ రూ. 2 కోట్ల సాయం
తెలుగు సినిమా నటీనటులు వయనాడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆర్థికసాయం ప్రకటించారు. తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేశారు. రూ. 2 కోట్లు కేరళ సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. వయనాడ్ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ అండగా నిలిచారు. ఇద్దరూ కలిపి రూ.కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు.. అందజేస్తామని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటన నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పోస్టు పెట్టారు. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం వయనాడ్ బాధితులకు సాయం చేశారు. కేరళ సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు. “వాయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటన నన్ను చాలా బాధించింది. కేరళ ప్రేక్షకులు ఎప్పుడూ నా మీద ప్రత్యేక ప్రేమను చూపించారు. వారు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. వారికి సాయం చేయడం నా ధర్మం. బాధితుల పునరావాస పనుల కోసం సీఎం సహాయన నిధికి రూ. 25 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. బాధితులు ఈ దుర్ఘటన నుంచి త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నాను” అని బన్నీ వెల్లడించారు.
వయనాడ్ బాధితులకు అండగా తమిళ, మలయాళీ నటులు
కేరళ బాధితులకు తమిళ, మలయాళ నటీనటులు అండగా నిలిచారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్ల విరాళం ఇవ్వడంతో పాటు స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు నటుడు మోహన్ లాల్. విశ్వనటుడు కమల్ హాసన్ రూ.25 లక్షలు సాయం చేశారు. చియాన్ విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సూర్య సోదరుడు కార్తి ముగ్గురు కలిపి రూ.50 లక్షలు అందించారు. నయనతార దంపతులు రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ కలిపి రూ.35 లక్షలు, పహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు సీఎం సహాయ నిధికి అందించారు. వీరితో పాటు పలువురు సినీ తారలు వయనాడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు.
Also Read: అందుకే టాప్ లేకుండా నటించాల్సి వచ్చింది, చాలా బాధపడ్డా: నటి అను అగర్వాల్