Janga Krishna Murthy: గురజాల వైసీపీలో చిచ్చు.. కాసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జంగా కృష్ణమూర్తి
janga sensational comments : ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జంగా. పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందంటూనే బడుగుల మనోభావాలను గుర్తించడం లేదని వాపోయారు.
Janga krishna Murthy Sensational Comments : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. టికెట్లు కేటాయింపులు, అభ్యర్థుల మార్పులు, టికెట్ల నిరాకరణ వంటి వ్యవహారాలతో వైసీపీలో విబేధాలు బయటకు వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని ఇద్దరు వైసీపీ నేతల మధ్య వైరం బయటపడింది. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.
గురువారం రాత్రి పిడుగురాళ్లలో తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నాళ్లుగా స్థానిక ఎమ్మెల్యే కాసు, ఎమ్మెల్సీ జంగా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరూ ఉప్పు, నిప్పుగా ఉంటూ రాజకీయాలను నెరపుతున్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి.
జంగా కృష్ణమూర్తి ఏమన్నారంటే
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జంగా కృష్ణమూర్తి గురువారం రాత్రి తన అనచరులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన ఆత్మగౌరవంపై దెబ్బకొట్టి, తనను ఆవేదనకు గురి చేశారని వాపోయారు. ’మా గ్రామంలోనూ నాకు తెలియకుండా సమావేశం పెట్టాలని చూశారు. స్థానిక ఎమ్మెల్యే అహంకారంతో వ్యవహరిస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. పదువులు, సంపాదన కోసం ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి గ్రామాల్లో చిచ్చు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. బడుగు, బలహీన వర్గాలను భయపెట్టి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని చూస్తున్నారని, ఇక్కడ తనకు జరుగుతున్న అవమానాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రికి చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. 2019లో గెలిచిన తరువాత ఎమ్మెల్యే ఏ కార్యక్రమానికి తనను పిలువలేదని, తనను పలుకరించిన వాళ్లను కూడా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తుందంటూనే బడుగుల మనోభావాలను గుర్తించడం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనుచరుల ముందు వాపోయారు. వైఎస్ ఆశయాల సాధన కోసం తాను ఏ పదవులు ఆశించకుండా పార్టీలో చేరానని, భవిష్యత్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉండాలని కేడర్‌ను ఆయన కోరారు.
దుమారం రేపుతున్న వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. వైఎస్ జగన్‌కు ఆత్మీయంగా మెలిగే నేతల్లో ఒకరిగా చెప్పుకునే కృష్ణమూర్తి పరిస్థితే ఇలా ఉంటే, మిగిలిన వారి పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. రాజకీయంగా జంగా చేసిన వ్యాఖ్యలు, ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉండాలని కోరిన కోరిక వంటివన్నీ.. ఆయన పార్టీ మారే ఆలోచనను తెలియజేస్తున్నాయని పలువురు చెబుతున్నారు. ఇద్దరి నేతల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించాల్సిన అధిష్టానం కూడా పట్టనట్టు ఉండడంతో ఇక్కడి వ్యవహారం తారాస్థాయికి చేరింది. ఇప్పుడు బహిరంగ వేదికలపైకి ఎక్కి విమర్శలు చేసుకునే స్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై దృష్టి సారించి అధిష్టానం చక్కబెడుతుందా..? లేక మరింత రాజుకునేంత వరకు చూస్తుందా..? అన్నది చూడాలి. ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన జంగా పార్టీ మారేందుకు సిద్ధపడినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.