Anantapur News: నేతల బల ప్రదర్శనకు కేరాఫ్ అడ్రస్‌గా నామినేషన్ల ఘట్టం
Andhra Pradesh News:అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఈ ప్రక్రియను కూడా బల ప్రదర్శనకు నేతలు వాడేశారు.
Elections 2024: ఎన్నికల నియమావళిలో నామినేషన్ల ఘట్టం చాలా కీలకమైనది అభ్యర్థులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు నామినేషన్ల ఘట్టాన్ని వేదికగా చేసుకున్నారు. వేలాదిగా జన సమీకరణను చేసుకునేందుకు లక్షలు వెచ్చించి భారీ ర్యాలీలు నిర్వహిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. ఈ జన సమీకరణలతో అభ్యర్థుల గెలుపు ఓటముల గురించి అంచనాకు వస్తారని అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు నుంచి వ్యక్తం అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సీన్‌లు కనిపించాయి.
పూర్తయిన నామినేషన్ ప్రక్రియ
సాధారణ ఎన్నికల్లో భాగంగా అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సంబంధించిన రిటర్నింగ్ అధికారుల వద్ద తమ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్ నేతల నామినేషన్ల ప్రక్రియలో పోటీ పడి మరి నామినేషన్లు దాఖలు చేశారు. జన సమీకరణ మొదలుకొని భారీ వాహనాలతో ర్యాలీలు.. తమ అభిమాన నేతలకు గజమాలలు ఇలా అడుగడుగునా హంగూ ఆర్భాటాలు కనిపించాయి. నామినేషన్‌కు తరలివచ్చిన కార్యకర్తలు, జనం కోసం అభ్యర్థులు భారీగానే ఖర్చు పెట్టారు. ఈ నామినేషన్ దాఖలు చేయడానికి ఒక్కో అభ్యర్థి 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్నికలు తెలుగుదేశం, వైఎస్ఆర్సిపికి ప్రతిష్టాత్మకంగా మారాయి. మధ్యలో కాంగ్రెస్ సైతం భరిలో ఉన్నామంటూ సంకేతాలు పంపిస్తోంది.
నేతల భారీ ప్రదర్శనాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేతలు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. దీని కోసం జన సమీకరణ చేపట్టారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ భారీ ఎత్తున నగరంలో ర్యాలీ నిర్వహించి వారి నామినేషన్లను దాఖలు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో మొదటగా సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. మరుసటి రోజు మాజీ మంత్రి పరిటాల సునీత పోటీగా ఇద్దరు నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణతో బల ప్రదర్శన నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎంపీ తల్లారి రంగయ్య వైయస్సార్సిపి నుంచి అసెంబ్లీ బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా అమిల్నేని సురేంద్రబాబు బరిలో దిగుతున్నారు. వీరు కూడా నియోజకవర్గంలో తమ బలాన్ని నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడానికి భారీ ఎత్తున జన సమీకరణ చేసుకొని వారి నామినేషన్లు దాఖలు చేశారు.
తాడిపత్రి నియోజకవర్గంలో కూడా ఇదే పంతాలో నామినేషన్ల పర్వం కొనసాగింది. సెట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నేత జెసి ప్రభాకర్ రెడ్డి తనయుడు జెసి ఆస్మిత్ రెడ్డి భారీ ర్యాలీతో బయలుదేరి వారి నామినేషన్లను దాఖలు చేశారు. హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కురువ దీపికా రెడ్డి సైతం బల నిరూపణతోనేనామినేషన్లు దాఖలు చేశారు.
పెనుగొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత ఉషశ్రీ చరణ్ కూటమి అభ్యర్థిగా సవితమ్మ భారీ జన సమీకరణ పోగేసి పెద్ద ఎత్తున పెనుగొండ నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించి మరి నామినేషన్ దాఖలు చేశారు. మడకశిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సామాన్యుడు వీర లక్కప్ప సైతం ఆ పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు టిడిపి రెబల్ అభ్యర్థి డాక్టర్ సునీల్ సైతం 5000 మందితో భారీ ర్యాలీ నిర్వహించి రెబల్ అభ్యర్థిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. కూటమి అభ్యర్థిగా ఎమ్మెస్ రాజు కూడా నామినేషన్ను దాఖలు చేశారు. గుంతకల్లు నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు ఇరు పార్టీల నేతలు సైతం ఒకరిని చూసి ఒకరు తమ బల ప్రదర్శనను నిరూపించుకున్నారు.
మొదటగా వైఎస్ఆర్సిపి నుంచి టిడిపిలోకి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి తన నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అంతకుమించి అన్నట్లు భారీ జన సమీకరణతో వచ్చి తన నామినేషన్ దాఖలు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలోనూ కూటమి అభ్యర్థి బిజెపి నేత సత్యకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తమ ప్రజా బలాన్ని చూపిస్తూ నామినేషన్లను దాఖలు చేశారు.
ఇలా నియోజకవర్గాల్లో తమ బల ప్రదర్శన నిరూపించుకునేందుకు నామినేషన్ ఘట్టాన్ని ఆయా పార్టీ నేతలు వేదికగా చేసుకొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేలుస్తూ తమ ప్రచారాల్ని ముందుకు కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం.