వలసలకు ఆద్యం పోషిందే కాంగ్రెస్ పార్టీ, రాహుల్, కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
KTR Comments on Rahul and Congress: కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana News: కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో వలసలకు ఆజ్యం పోసిందన్న కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఆయారాం.. గయారాం సంస్కృతికి ఇప్పటికైనా స్వస్తి చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ వలస నేతలను ప్రోత్సహించాలనే సాంప్రదాయాన్ని విడనాడితే మంచిదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అనే హామీ ఇవ్వడాన్ని స్వాగతించదగ్గ నిర్ణయమన్న కేటీఆర్.. అమలు చేయడంలో పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే చెప్పేది ఒకటి.. చేసేది మరికొటిగా ఉంటోందన్నారు. తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయని ఆక్షేపించిన కేటీఆర్.. ఏళ్ల తరబడి ఈ తరహా విధానాలను అనుసరించడం దారుణమన్నారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే.. మరో వైపు తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.
రాహుల్ హిపోక్రట్‌గా మిగులుతారు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి తమ పార్టీ ఇచ్చే హామీలపైన నిబద్ధత ఉంటే.. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై మాట్లాడాలని సూచించారు. లేకపోతే రాహుల్ గాంధీ ఒక హిపోక్రట్‌గా మిగిలిపోతారన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆ ఇద్దరు నేతలపై స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందనే మెసేజ్‌ను ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. అబద్ధాలు చెప్పమనే విషయాన్ని దేశానికి రాహుల్ గాంధీ నిరూపించుకోవాలని రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాల్ విసిరారు.
బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాల్లో వేడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ నేతలు మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు తరువాత తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉండదంటూ బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యలు చేయగా.. దానికి అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నేతలు సరిపెట్టుకుండా తమ బలాన్ని మరింత పెంచుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. తద్వారా తమ ప్రభుత్వ మనుగడను అస్తిరపర్చాలనుకునే బీఆర్‌ఎస్ పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, మరింత మందితో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. పార్లమెంట్‌కు ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ మద్య నెలకొన్న తాజా పరిస్థితులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.