Jubilee Hills By- elections 2025: జూబ్లీహిల్స్ బరిలో ఎమ్మెల్యే అభ్యర్ది కోసం బీజేపి ఎదురుచూపులు.! ఓడించే గెలుపు గుర్రం దొరికేనా.?
Jubilee Hills By- elections 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు గుర్రాలు సిద్దమైయ్యాయి. కాంగ్రెస్ ,బిఆర్ ఎస్ తమ అభ్యర్దులను ప్రకటించాయి. బిజేపి మాత్రం గెలుపు గుర్రాల వేటలోనే ఉంది.

Jubilee Hills By-elections 2025: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమరం షురూ అయ్యింది. బీఆర్‌ఎస్ అభ్యర్ది మాగంటి సునీత, అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే బిజేపి మాత్రం నేటికీ ఎమ్మెల్యే అభ్యర్దిని ప్రకటించలేదు. ఆశావాహుల జాబితా చాంతాడంత లిస్ట్ వచ్చినప్పటికీ వారిలో ఎవరూ అంతగా పోటీ ఇస్తారనే నమ్మకం అధిష్ఠానంలో కలిగినట్లు లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇతర పార్టీల నేతలను సైతం కమాన్ కమాన్ అంటూ పిలుస్తున్న వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు తెలంగాణలో ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆ కుటుంబంపై సింపథీ ఉందని, కచ్చితంగా సానుభూతి వర్కవుట్ అవుతుందని భావించిన బిఆర్‌ఎస్ మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలో దించింది. తాను మాత్రం ఏం తక్కువ తినలేదంటూ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేసి, బిసి అభ్యర్ది నవీన్ యాదవ్‌ను రంగంలోకి దించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ , గత పదేళ్లుగా పార్టీలో కొనసాగుతూ, స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమవ్వడంతోపాటు, ప్రత్యర్థి బీఆర్‌ఎస్ ఓసీ అభ్యర్థి కావడంతో తాము వదిలిన బీసీ బుల్లెట్ విజయం సాధిస్తుందనే ధీమాతో ఉంది. ఇలా ఓవైపు బీఆర్‌ఎస్, మరో వైపు కాంగ్రెస్ పార్టీలు తమ గెలుపు రేసులో పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక్కడ మరో ప్రధాన పార్టీ బిజేపి మాత్రం ఎవరిని బరిలోకి దించింతే గెలుపు వరిస్తుందనే లెక్కలతో అయోమయంలో ఉందని పొలిటికల్ సర్కిల్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ తాము పోటీకి సిద్దమంటూ బీజేపి అధిష్ఠానం పెద్దలతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటు కోసం పోటీపడుతున్న ఆశావాహుల లిస్ట్ భారీగా ఉంది. ముఖ్యంగా లంకల దీపక్ రెడ్డి పేరు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. లంకల దీపక్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 25వేల ఓట్లు సాధించారు. గతలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 70వేలకుపైగా ఓట్లు సొంత చేసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గంపై పట్టున్న ఉన్న నేత కావడంతో తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలంటూ కిషన్ రెడ్డి వద్ద గట్టిగానే లాబియింగ్ చేస్తున్నట్లు సమాచారం. బిజేపి మహిళ అభ్యర్థి కోటాలో ఆకుల విజయ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను స్థానికురాలిని కావడంతోపాటు తన భర్త మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇరు వర్గాల ఓట్లు తనకు అనుకూలంగా మారుతాయంటూ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు విజయ. వీరికి తోడు రెడ్డి సామాజిక వర్గం నుంచి కీర్తిరెడ్డి, కమ్మ కోటాలో కిలారి మనోహర్, మహిళా అభ్యర్థిగా విరపనేని పద్మ టిక్కెట్ రేసులో ఉన్నారు. మేము సైతం అంటూ సినీ నటి జయసుధ, నందమూరి సుహాసిని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంతలా అభ్యర్థులు మేమంటే మేంటూ పోటీ పడుతుంటే , బీజేపి అధిష్ఠానం మాత్రం వీళ్లు కాకుండా ఇంకెవరైనా గట్టి అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా బొంతు రామ్మోహన్ వ్యవహారమే అందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీలో సీటు ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించి మరీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది.
బొంతు అయితేనే ఇప్పుడు పోటీలో ఉన్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించగలడని భావించిన అరవింద్ ఇదే విషయాన్ని అధిష్ఠానం ముందుంచారు. అయితే బిజేపి ఆశలమీద నీళ్లు చల్లిట్లుగా తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని, బిజేపికి వెళ్లనని, పార్టీ టిక్కెట్ అవసరం లేదంటూ బొంతు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు బిజేపి ముందున్న ఆప్షన్ ఒకటే, తమ వద్దకు వచ్చిన ఆశావాహుల లిస్ట్‌లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థిని జూబ్లీహిల్స్ బరిలోకి దించడం. కానీ ఆ స్థాయిలో పోటీ ఇచ్చి, పార్టీని గెలిపించేవారు లేక, అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఈ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కచ్చితంగా పార్టీని గెలిపించి, అధిష్ఠానం పెద్దలకు బహుమతిగా ఇవ్వాలని తెలంగాణ కమలం నేతలు గట్టి సంకల్పంతో ఉన్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ రారు సరే , మరే ఇతర నేతలైనా, వాళ్లు ఏ పార్టీలో ఉన్నా సరే , ఓడించే సత్తా ఉంటే చాలు ఇదే మా ఆహ్వానం అంటూ పార్టీలకు అతీతంగా తెలంగాణ బీజేపి నేతలు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.





















