Pharmacy Counselling: ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో కౌన్సెలింగ్, మొదట ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు
ఏపీలో బీ-ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నాగరాణి అక్టోబరు 29న ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీలో బీ-ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నాగరాణి అక్టోబరు 29న ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ అభ్యర్థులకు మొదటి 5 రోజులు ప్రవేశాల ప్రక్రియ నిర్వహించనున్నట్లు, వారికి సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఫార్మసీ కళాశాలల అనుమతులకు ఫార్మసీ కౌన్సిల్ గడువు పొడిగించడంతో కౌన్సెలింగ్ కొంత ఆలస్యమైందని నాగమణి పేర్కొన్నారు.
ఏపీ ఈఏపి సెట్ 2023 ఫలితాలను జూన్ 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ అనంతపురం పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది మే 15 నుంచి 23 వరకు ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ అడ్మిషన్‌ల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించారు. మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికి (93.38 శాతం) పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది; ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
Also Read: బీఎస్సీ అలైడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు ఇలా
తేల్చని ప్రభుత్వం..
రాష్ట్రంలో ఇంజినీరింగ్ మూడోవిడత కౌన్సెలింగ్ ఉంటుందా.. లేదా అనేదానిపై స్పష్టత కొరవడింది. ప్రతి ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించే ఉన్నత విద్యామండలి ఈ ఏడాది రెండు విడతలతోనే సరిపెట్టింది. మూడోవిడత ఉంటుందని చాలామంది విద్యార్థులు రెండోవిడతలో సీట్లు వచ్చినా చేరలేదు. మరికొందరు కోర్సులు, కళాశాలలు మార్చుకోవచ్చని ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల నుంచి వినతులు రావడంతో మొదట్లో మూడోవిడత నిర్వహణపై పరిశీలిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ, ఇంతవరకు దీనిపై ఉన్నత విద్యామండలి స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. కన్వీనర్ కోటాలో చేరేవారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదవారు ఉంటారు. కన్వీనర్ కోటాలో చేరేవారికి ప్రభుత్వమే బోధన రుసుములు చెల్లిస్తుంది. స్పాట్, యాజమాన్య కోటాల్లో చేరితే విద్యార్థులే ఫీజుల భారం భరించాలి. మూడోవిడతపై స్పష్టత లేక.. చాలామంది స్పాట్, యాజమాన్య కోటాలో చేరాల్సి వచ్చింది. విద్యార్థులకు సౌలభ్యంగా ఉండాల్సిన కౌన్సెలింగ్.. ప్రభుత్వం ఫీజుల డబ్బులు మిగుల్చుకునేలా ఉంటోంది.
Also Read: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడి, ఫీజు వివరాలు ఇలా
బోధన రుసుములు తప్పించుకునేందుకేనా?
స్పాట్ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు ఉండదు. అదే మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా చేరితే ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళనతో అక్టోబరు 3న ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టాలని కోరారు. ఫీజుల డబ్బులను మిగుల్చుకునేందుకు ఒక విడత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం ఎత్తివేసిందని వారు విమర్శిస్తున్నారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్ నోటిఫికేషన్ ఇచ్చినందున చాలా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి.