Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Jamnagar Murder: గుజరాత్‌లో ప్రియుడితో కలిసి భర్తకు సైనైడ్ ఇచ్చి చంపేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్యాక్టరీలో పూడ్చి పెట్టి.. ఆస్ట్రేలియా వెళ్లాడని అందర్నీ నమ్మించింది.

Husband Body Cut Into Pieces : గుజరాత్‌లోని జామ్‌నగర్ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఓ సంచలనాత్మక హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడనుకున్న కన్నకొడుకు, కంటికి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులకు పోలీసుల దర్యాప్తులో కోలుకోలేని నిజం ఎదురైంది. కట్టుకున్న భర్తనే పక్కా పథకం ప్రకారం హత్య చేసి, దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్యాక్టరీ నేలలో పాతిపెట్టి.. ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు అంటూ రెండేళ్లపాటు ఆడిన ఘోరమైన నాటకాన్ని గుజరాత్ పోలీసులు బట్టబయలు చేశారు.
జామ్‌నగర్‌కు చెందిన జిగ్నేశ్ మావడియా, పృథ్వీలకు వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందే పృథ్వీకి నిలేష్ అనే వ్యక్తితో తీవ్రమైన ప్రేమ సంబంధం ఉంది. వివాహం జరిగిన తర్వాత కూడా పృథ్వీ తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ వ్యవహారానికి భర్త జిగ్నేశ్ అడ్డుగా ఉన్నాడని భావించిన పృథ్వీ, ప్రియుడు నిలేష్‌తో కలిసి అతడిని శాశ్వతంగా మట్టుబెట్టాలని పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసింది. ప్లాన్ ప్రకారం జిగ్నేశ్‌కు తాగే మద్యంలో అత్యంత ప్రాణాంతకమైన సైనైడ్ కలిపి ఇచ్చి దారుణంగా హత్య చేశారు.
హత్య అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు నిందితులు అతి భయంకరమైన దారిని ఎంచుకున్నారు. జిగ్నేశ్ మృతదేహాన్ని జామ్‌నగర్‌లోని జీఐడీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీకి రహస్యంగా తరలించారు. అక్కడ మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి, శవం ఆనవాళ్లు కూడా మిగలకుండా ఉండేందుకు సుమారు 12 అడుగుల లోతైన గోతి తవ్వి అందులో పాతిపెట్టారు. అనంతరం ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చిన పృథ్వీ, జిగ్నేశ్‌కు ఆస్ట్రేలియాలో అత్యధిక జీతంతో ఉద్యోగం వచ్చిందని, అత్యవసరంగా అక్కడికి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులకు అబద్ధం చెప్పి నమ్మించింది.
అయితే రెండేళ్లపాటు సాఫీగా సాగిన ఈ కిరాతక నాటకం ఒక చిన్న పొరపాటుతో ముగిసిపోయింది. జిగ్నేశ్ కుటుంబంలో ఒక బంధువు ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమవ్వడంతో, అక్కడ ఉన్న జిగ్నేశ్ అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వాలని పృథ్వీని కోరారు. పృథ్వీ రకరకాల సాకులు చెప్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో జిగ్నేశ్ సోదరుడు అశోక్‌కు తీవ్రమైన అనుమానం వచ్చింది. వెంటనే అశోక్ స్వయంగా విచారించగా, ఆస్ట్రేలియా ఎంబసీ , అధికారిక రికార్డుల్లో జిగ్నేశ్ పేరుతో ఎలాంటి వీసా లేదా ప్రయాణ వివరాలు లేవని తేలింది. దీంతో తమ్ముడు అదృశ్యంపై అశోక్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు పృథ్వీతో పాటు ఆమె ప్రియుడు నిలేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణాధికారుల ప్రశ్నల వర్షానికి, సాంకేతిక ఆధారాల ముందు నిలబడలేక పృథ్వీ తాను చేసిన దారుణ హత్యను ఒప్పుకుంది. ఆమె ఇచ్చిన సమాచారంతో జీఐడీసీ ఫ్యాక్టరీకి చేరుకున్న పోలీసులు, మెజిస్ట్రేట్ సమక్షంలో 12 అడుగుల లోతు తవ్వి భౌతికకాయం అవశేషాలను వెలికితీశారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే ముక్కలు చేసి పాతిపెట్టిన ఈ ఘాతుకం గుజరాత్ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిందితులిద్దరిపై హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.
ట్రెండింగ్ వార్తలు





















