ఆగస్టు 13న అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డులోని కీలక భాగం ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని అధికారికంగా ప్రారంభిస్తారు.
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Amaravati Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కీలక మౌలిక సదుపాయమైన సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ -2 ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు -13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభిస్తారు.
- వెంకటపాలెం నుండి ఉండవల్లి వరకు రెండో దశ ఆగస్టు 13న అందుబాటులోకి వస్తుంది.
- ఈ రోడ్డు విజయవాడ నుండి అమరావతికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిస్తుంది.
- స్టీల్ బ్రిడ్జిలు, వ్యూ పాయింట్లు పర్యాటక కేంద్రాలుగా మారే అవకాశం.
Amaravati Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాజధాని నగరానికి లైఫ్‌లైన్‌గా చెప్పుకుంటున్న సీడ్ యాక్సిస్ రోడ్డులోని అత్యంత కీలకమైన భాగం ఆగస్టు 13 నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక రహదారితోపాటు, ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన ఎమ్మెల్సే, ఎమ్మెల్సీ టవర్లను కూడా అదే రోజున అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు అంటే 12 ఆగస్టు ముఖ్యమంత్రి కాన్వాయ్‌తో ఈ రహదారిపై అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏంటీ సీడ్ యాక్సిస్ రోడ్డు
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో అత్యంత కీలకమైన ఈ రహదారిని టెక్నికల్‌గా E-3 రోడ్డుఅని పిలుస్తారు. ఇది రాజధాని నగరంలోని ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండే 17 ప్రధాన ఎన్ సిరీస్ రోడ్లను ఒకదానితో ఒకటి కలిపే మార్గం.
ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం పొడవు 21.78కిలోమీటర్లు. ఇది దొండపాడు గ్రామం వద్ద ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి గ్రామాల మీదుగా సాగి మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో కలుస్తుంది.
ఈ రోడ్డుకు సంబంధించి రైట్ ఆఫ్ వే 60 మీటర్లుగా నిర్ణయించారు. భవిష్యత్‌లో దీనిని 8 నుంచి 9 లేన్‌ల వరకు విస్తరించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్రస్తుతం 11 మీటర్ల వెడల్పుతో కూడిన క్యారేజ్ వేస్, సర్వీస్ రోడ్లు, సెంట్రల్ బీఆర్‌టీఎస్ కారిడార్‌తో నిర్మించారు.
మూడు దశల్లో అభివృద్ధి
ఈ భారీ ప్రాజెక్టును అధికారులు మూడు దశలుగా విభజించారు. ఫేజ్-1 పొడవు 14. 35 కిలోమీటర్లు. ఇది దొండపాడు నుంచి వెంకటపాలెం (మంతెన ఆశ్రమం) వరకు ఉంటుంది. ఇది ఇప్పటికే పూర్తి అయ్యి రాకపోకలు సాగుతున్నాయి. రెండోది 3.92 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫేజ్ -2. వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు సాగుతుంది. ఈ భాగమే ఆగస్టు 13న ప్రారంభమవుతుంది. భూసేకరణ సమస్యలు, కోర్టు వ్యాజ్యాలను అధిగమించి ప్రభుత్వం ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. 3.50 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫేజ్ -3 ఉండవల్లి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు నిర్మిస్తున్నారు. ఇందులో ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్ 320 మీటర్ల ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదించారు.
ప్రత్యేక ఆకర్షణగా స్టీల్ బ్రిడ్దిలు
ఈ రహదారిలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నవి ఉండవల్లి వద్ద నిర్మించిన భారీ స్టీల్ బ్రిడ్జ్‌లు. 110 మీటర్ల పొడవుతో బకింగ్‌హమ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. దానిపై తారు పనులు పూర్తి చేశారు. రాజధానికి వరద ముప్పు లేకుండా చేసే కొండవీటి వాగుపై 284మీటర్‌ల పొడవుతో అధునాతన స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.
ఈ ప్రాంతాన్ని కేవలం ఒక రహదారిగానే కాకుండా, ఒక పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణానది, కొండవీటి వాగు అందాలను చూసేందుకు ఇక్కడ ప్రత్యేక వ్యూ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణహితంగా ఉండేందుకు స్లైక్లింగ్ ట్రాక్‌లు, వాకింగ్ ట్రాక్‌లు, సుందరమైన ల్యాండ్‌స్కేప్ గార్డెన్లను అభివృద్ధి చేస్తున్నారు.
ఎందుకు సీడ్ యాక్సిస్ రోడ్డు ఇంత ప్రాధాన్యత ?
విజయవాడ నుంచి అమరావతి సచివాలయానికి హైకోర్టుకు వెళ్లే వేల మంది ఇరుకైన కరకట్ట రహదారిపై ఆధారపడేవారు. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదకరమైన మలుపులు, గుంతల రోడ్డులతో ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు సమయం ఆదా అవుతుంది. దాదాపు అర గంట కలిసి వస్తుంది. నాలుగు లేన్ల రహదారి కావడంతో ప్రమాదాల భయం లేదు. ఈ కారిడార్ వెంబడి ఉన్న ఉండవల్లి, పెనుమాక, మందడం ప్రాంతాల్లో భూముల రేట్లు పెరగనున్నాయి. ఐటీ కంపెనీలు, హోల్స్ రానున్నాయి.
ముఖ్యమంత్రి పర్యటన కోసం అమరావతి అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీపార్థసారథి, గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్ ఉండవల్లి స్టీల్ బ్రిడ్జి ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లు సమీక్షించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చేపట్టిన సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రాజెక్టు కోసం మొత్తం 320. 54 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో ఇప్పటికే 278.93 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. ఈ రహదారి కేవలం రవాణా కోసమే కాకుండా రాజధాని నగరంలో గ్యాస్ పైప్‌లైన్లు, వాటర్ మెయిన్స్, ఐసీటీ కారిడార్లు వంటి భూగర్భ వసతుల ఏర్పాటుకు ఉపయోగపడనుంది.
Frequently Asked Questions
అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డులో కీలక భాగం ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది?
అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డును సాంకేతికంగా ఏమని పిలుస్తారు?
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఉన్న ఈ రహదారిని సాంకేతికంగా E-3 రోడ్డు అని పిలుస్తారు. ఇది రాజధాని నగరంలోని ఉత్తరం నుంచి దక్షిణానికి ఉండే ప్రధాన రోడ్లను కలుపుతుంది.
సీడ్ యాక్సిస్ రోడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
ఈ రహదారితో విజయవాడ నుంచి అమరావతికి ప్రయాణ సమయం దాదాపు అర గంట తగ్గుతుంది. ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాల భయం లేకుండా సురక్షితమైన ప్రయాణం సాధ్యమవుతుంది.
సీడ్ యాక్సిస్ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణలు ఏమిటి?
ఈ రహదారిలో ఉండవల్లి వద్ద బకింగ్‌హమ్ కెనాల్‌పై, కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలు ప్రధాన ఆకర్షణలు. పర్యాటకుల కోసం వ్యూ పాయింట్లు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు





















