Vizianagaram Kidnap : కూల్ డ్రింక్స్ ఆశ చూపి ఇద్దరు చిన్నారులను కిడ్నాప్, గంటల వ్యవధిలో కేసును ఛేదించిన పోలీసులు
Vizianagaram Kidnap : విజయనగరం జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపింది. కూల్ డ్రింక్స్ కొనిస్తానని చెప్పి చిన్నారులను ఓ మహిళ కిడ్నాప్ చేసింది. కానీ గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కింది.
Vizianagaram Kidnap : విజయనగరం జిల్లా బాడంగి మండలం డొంకిన వలసకు చెందిన ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిందో మహిళ. ఆదివారం మధ్యాహ్నం సుమారు 11.30 గంటల సమయంలో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసింది. ముందే విజయనగరం వెళ్లాలని ఓ అద్దె కారును బుక్ చేసుకుంది. అప్రమత్తమైన తల్లిదండ్రులు కిడ్నాప్ అయిన విషయాన్ని పోలీసులకు తెలియపరచడంతో రంగంలోకి దిగారు పోలీసులు. కిడ్నాపర్ ప్రయాణిస్తున్న కారు నెంబరు ఆధారంగా రాజాం సమీపంలో మహిళను అదుపులోకి తీసుకున్నారు.
బాడంగి మండలం డొంకినవలస గ్రామానికి చెందిన కామేశ్వరరావు, ప్రియాంకల ఎనిమిది నెలల అబ్బాయి రాజేటి ధన్విత్(8 నెలలు), ఈశ్వర రావు, సరోజినిలకు చెందిన కూతురు కొండేటి సుస్మిత(11) డొంకినవలసలోని వారి ఇంటివద్ద ఆడుకుంటున్నారు. ధన్విత్ వాళ్ల అమ్మమ్మకు గత కొద్ది రోజులు క్రితం విజయవాడలో కిడ్నాపర్ గుగ్గిలాపు శోభ అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయంతో కొద్ది రోజుల క్రితం డొంకినవలసకు చుట్టరికానికి వచ్చిన కిడ్నాపర్ శోభ 3 రోజులు ఉండి మరలా వెళ్లిపోయింది. మరలా 2 రోజుల క్రితం డొంకిన వలసలోని ధన్విత్ అమ్మమ్మ ఇంటికి వచ్చిన కిడ్నాపర్ శోభ.. అందరితో సరదాగా గడిపి శనివారం అందరితో కలిసి విజయనగరం షాపింగ్ కు కూడా వచ్చింది. ఇక ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో 8 నెలల ధన్విత్ ను ఎత్తుకొని ఇంటి దగ్గర ఆడుకుంటున్న సుస్మిత(11) ను, ధన్విత్ (8 నెలలు) లను శోభ కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారమే ఉదయమే విజయనగరం వెళ్లాలని బాడుగకు కారును తెప్పించుకున్న కిడ్పాపర్ శోభ ఉదయం 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద పిల్లలకు కూల్ డ్రింకులు కొని ఇస్తానని మాయమాటలు చెప్పి కారు ఎక్కించుకుంది.
అద్దె కారులో
అనంతరం కారు డ్రైవర్ తో పాలకొండకు వెళ్లాలని చెప్పింది. అయితే ఇవేమీ తెలియని కారు డ్రైవర్ పిల్లలు ఎవరిని అడగగా, తాను తన భర్తతో విబేధాలు ఉన్నాయని, వీరిద్దరూ తమ పిల్లలనేనంటూ మాయమాటలు చెప్పింది. ఇద్దరు పిల్లలను కారులోకి ఎక్కించి డ్రైవర్ ను పాలకొండ వైపు వెళ్లాలని చెప్పింది. దీంతో కారు డ్రైవర్ తన కారును డొంకిన వలస నుంచి రాజాం మీదుగా పాలకొండ వైపు వెళ్తున్నాడు. కాగా సుమారు ఒంటి గంట సమయంలో తమ పిల్లలు కనిపించడం లేదని చూసుకున్న తల్లిదండ్రులు. చుట్టుపక్కల వెతికారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే 2 గంటల సమయంలో బాడంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
(బొబ్బిలి డీఎస్పీ మోహనరావు)
ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జరిగిన ఘటనపై విచారించి, ధన్విత్ అమ్మమ్మ ఇంటికి వచ్చిన శోభ ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసి ఉంటుందని ఓ అవగాహనకు వచ్చారు. బాడంగి, తెర్లాం, రాజాం పోలీసులను అప్రమత్తం చేయడంతో పాటూ సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్, కిడ్నాపర్ ప్రయాణిస్తున్న కారు నెంబరు ఆధారంగా కారును ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఫిర్యాదు అందిన గంట వ్యవధిలోనే బాడంగి పోలీసులు కారును రాజాం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉన్న నిందితురాలు శోభ అనే మహిళను అదుపులోకి తీసుకుని, పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. అయితే కిడ్నాపర్ శోభ ఈ పిల్లలను ఎందుకు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందన్న విషయం ఇంకా బయటకు రాలేదని, పిల్లలను ఏమి చేయాలని శోభ భావించిందన్న దానిపై ఇంకా నిందితురాలిని విచారించాల్సి ఉందని, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని బొబ్బిలి డీఎస్పీ మోహనరావు తెలిపారు.