Annamayya District: రైలు పట్టాలపై కూర్చొని గంజాయి సేవించారు - మత్తులో ఉండగా రైలు ఢీకొని ఇద్దరు విద్యార్థుల మృతి
Andhra News: రైలు పట్టాలపై గంజాయి తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. మత్తులో రైలు గమనించక ఈ ప్రమాదం జరిగింది.
Students Killed Due To Train Collision: రైలు పట్టాలపై గంజాయి సేవించిన ఇద్దరు విద్యార్థులు మత్తులో ఉండగా రైలు ఢీకొని మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో (Annamayya District) చోటు చేసుకుంది. కదిరి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి కిరణ్ కుమార్ (18), అదే పట్టణానికి చెందిన ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి యాసిన్ (17) మంగళవారం రాత్రి చిత్తూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి గంజాయి తీసుకోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో నాగర్‌కోయిల్ నుంచి ముంబయి వెళ్లే రైలు వీరిపై నుంచి దూసుకెళ్లింది. గంజాయి మత్తులో రైలు వస్తోన్న విషయాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. లోకోపైలట్ అందించిన సమాచారంతో రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. యాసిన్ అప్పటికే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉన్న కిరణ్‌కుమార్‌ను తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ గంజాయికి అలవాటు పడ్డారని.. వారి వద్ద గంజాయి పొట్లాలు దొరికాయని రైల్వే పోలీసులు వెల్లడించారు.
ప్రియుడి మోజులో పడి..
మరోవైపు, ప్రియుడి మోజులో పడి ఓ మహిళ భర్తకే విషం పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఏవీ నగరంలో వివాహిత ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో పని చేసే వివాహితకు.. అక్కడే పని చేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం కాస్త భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే, తమ అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా భర్తకు ఈ నెల 19వ తేదీన విషం పెట్టి హతమార్చి.. సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో అసలు నిజం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భార్యే.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.