Constables Death: ఆన్‌లైన్ మోసం, అవమాన భయం - ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్య వెనుక అసలు కథ ఇదే!
Crime News: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆన్ లైన్ మోసంతో ఒకరు బలవన్మరణానికి పాల్పడగా.. మరొకరు అవమాన భారంతో ప్రాణాలు తీసుకున్నారు.
Two Constables Suicide In Joint Medak District: ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak District) ఒకేరోజు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యకు పాల్పడడం అటు వారి కుటుంబాలు, ఇటు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. ఆన్‌లైన్ మోసంలో రూ.25 లక్షలు నష్టపోయిన ఓ కానిస్టేబుల్ భార్య, ఇద్దరు పిల్లలకు విషం తాగించి అనంతరం తానూ తాగారు. అయినా, చావకపోవడంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. భార్యా పిల్లలను స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. మరో ఘటనలో వివాహేతర సంబంధం అన్న నిందారోపణతో ఓ కానిస్టేబుల్ స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు.
ఆన్ లైన్ మోసంతో..
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బాలకృష్ణ అదే జిల్లాలోని టీజీఎస్‌పీ 17వ బెటాలియన్‌లో హెచ్‌సీగా పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సిద్ధిపేటలోని కలకుంట కాలనీలో నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికొచ్చిన ఆయన ఆందోళనగా కనిపించగా భార్య ఆరా తీశారు. అధిక లాభాల ఆశతో మహారాష్ట్రకు చెందిన గుర్తు తెలియని ఓ కంపెనీలో విడతలవారీగా రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టానని.. తర్వాత కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. అప్పులు తీర్చే మార్గం లేదని.. శనివారం రాత్రి టీలో ఎలుకల మందు కలిపి పిల్లలకు తాగించి అనంతరం తామూ తాగారు.
ఉరి వేసుకుని..
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు స్పృహలోకి వచ్చిన బాలకృష్ణ.. భార్యాపిల్లలు ప్రాణాలతో ఉండడాన్ని గమనించారు. మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి మెలకువ వచ్చిన భార్య.. సమీపంలోని బంధువులకు ఫోన్ చేయగా వారు వచ్చి అందరినీ సిద్ధిపేట సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలకృష్ణ మృతి చెందగా.. మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మానస, పిల్లలను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని.. ఆన్ లైన్ మోసంపై దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు.
అవమాన భయంతో..
ఇక మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్‌లో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్వార్టర్స్ ఆవరణలోనే సాయికుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆయన భార్య శైలజ ఫిర్యాదు మేరకు.. ఎస్సై మహ్మద్ గౌస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపూర్‌లో నివసిస్తోన్న సాయికుమార్‌కు అదే పట్టణంలోని దివ్య అనే మహిళతో పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. ఈ క్రమంలోనే ఆమెతో పాటు భర్త శివకుమార్, అల్లుడు కిరణ్‌కుమార్.. సాయికుమార్‌ను వేధించసాగారు. దివ్యను సాయికుమార్ వేధిస్తున్నాడంటూ ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. విషయం తీవ్రంగా మారితే.. పరువు పోతుందని సాయికుమార్ ఆందోళన చెందారు. శనివారం రాత్రి విధులు నిర్వహించిన ఆయన ఆదివారం ఉదయం నడకకు వెళ్లి.. టీ తాగి స్టేషన్‌కు వచ్చారు.
అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి స్టేషన్ ఆవరణలోనే చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలించగా.. స్టేషన్ వెనుక విగతజీవిగా కనిపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: KTR: ఈడీ నోటీసులొచ్చాయి కానీ - కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్ - పూర్తిగా లైట్ తీసుకున్నట్లేనా !?