Accidents In Tirumala Ghat Road: తిరుమల ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు, 12 మందికి గాయాలు
Accidents In Tirumala Ghat Road: తిరుమల మొదటి ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 12 మంది గాయపడ్డారు.
Accidents In Tirumala Ghat Road: తిరుమల మొదటి ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌లో 26వ మలుపు వద్ద కూలీలతో వాహనం అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. 30వ మలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ రెండు ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి.
కూలీలతో వెళ్తున్న వాహనానికి ప్రమాదం
తిరుమల మొదటి ఘాట్‌లో మరో పెను ప్రమాదం తప్పింది. సోమవారం సాయంత్రం తిరుమలలో పని చేస్తున్న కూలీలతో వాహనం తిరుపతికి బయల్దేరింది. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌లో 26వ మలుపు వద్ద కూలీలతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి పిట్ట గోడను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 20 మంది ఉండగా పది మంది కూలీలకు గాయాలయ్యాయి. ఎవరికీ తీవ్రగాయాలు అవలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులను 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
చెట్టును ఢీకొట్టిన కారు
తిరుమల ఘాట్ రోడ్డులో 30వ మలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. కర్ణాటకకు చెందిన భక్తులు శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి వస్తుండగా కారు అదుపు తప్పి 30వ మలుపు వద్ద చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో కర్ణాటకకి చెందిన ఇద్దరు భక్తులకు గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. శ్రీవారి దయతోనే ప్రమాదం తప్పిందని భక్తులు చెప్పారు.
తిరుమల ఘాట్‌లో పెరిగిన ప్రమాదాలు
తిరుమల రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. తిరుమల ఘాట్ రోడ్లలో అత్యంత ప్రమాదకర మలుపులు ఉంటాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మలుపులపై అవగాహన లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. గత జులై 25న రెండో ఘాట్ రోడ్డులో గోవింద మలుపు సమీపంలో కారు రైలింగ్‌ను ఢీకొట్టింది. ఘటనలో విజయవాడకు చెందిన ఇద్దరు వృద్ధులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అదే జులై నెల 18న మొదటి ఘాట్ రోడ్డులోని 17 మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే వాహనం తోటి భక్తులు బయటకు తీశారు. ఆ వెంటనే అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ వచ్చే వరకు గాయపడిన వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వారని తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ వరుస ప్రమాదాలతో టీటీడీ అలర్ట్ అయ్యింది. శ్రీవారి ఆశీస్సులు కోరుతూ గతంలో టీటీడీ విశిష్ట మహా శాంతి హోమం నిర్వహించింది. తిరుమల దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఈ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. అలాగే ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు విజిలెన్స్ సిబ్బంది మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకుని అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.