(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఓ చోట ఆస్తి కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రినే హతమార్చగా.. మరో చోట అప్పుల బాధతో ఇద్దరు సోదరులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Son Murdered His Father In Nellore: ఏపీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా (Nellore District) సైదాపురం మండలం మొలకలపూండ్లలో పాలెపు వెంకటేశ్వర్లు, అతని కుమారుడు శివాజీకి గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. తాను చెప్పినట్లు ఆస్తిని పంచాలని తండ్రికి శివాజీ చెప్పగా.. అందుకు ఆయన నిరాకరించాడు. ఈ క్రమంలోనే గురువారం మరోసారి ఆస్తికి సంబంధించి తండ్రితో శివాజీ గొడవకు దిగాడు. ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సహనం కోల్పోయిన శివాజీ తండ్రి వెంకటేశ్వర్లుపై బండరాయితో దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది.
అప్పుల బాధతో అన్నదమ్ములు
అటు, ఏలూరు జిల్లాకు (Eluru District) చెందిన ఇద్దరు అన్నదమ్ములు వారణాశిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ (34), వినోద్ (32) ఏప్రిల్ నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు కొద్ది రోజులు తెలిసిన వారు, సన్నిహితుల ఇళ్లల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో మే నెలలో చేబ్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసే అన్నదమ్ములు కనిపించకుండా పోవడంతో అనుమానాలు వ్యక్తం కాగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. అయితే, వారణాశిలోని ఆంధ్ర ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకున్న సోదరులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నారని.. దీంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇద్దరు సోదరులు సెల్ఫీ వీడియో తీశారు. సెల్ ఫోన్‌లో మొబైల్ నెంబర్ల ఆధారంగా వారణాశి పోలీసులు నారాయణపురంలో బంధువులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ మృతదేహాల కోసం బంధువులు వారణాశి వెళ్లారు.