Heart Attack: క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ - స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా తీవ్ర విషాదం
Krishna News: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.
Young Man Died Due To Heart Attack In Krishna District: ఆ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రిస్మస్ సెలవులకని ఇంటికి వచ్చాడు. సరదాగా స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుతో మైదానంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా (Krishna District) గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో (Kouthavaram) బుధవారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగలూరుకు చెందిన కొమ్మాలపాటి సాయికుమార్ (26) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. క్రిస్మస్ సెలవు రావడంతో ఆదివారం సొంతూరికి వచ్చాడు.
క్రికెట్ ఆడుతుండగా..
కౌతవరం హైస్కూల్‌లో బుధవారం క్రికెట్ పోటీ ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాసేపు ఆడిన అనంతరం ఛాతీ నొప్పితో అలసటగా అక్కడే కూర్చుండిపోయాడు. స్నేహితులు ఆస్పత్రికి వెళ్దామని చెప్పినా.. గ్యాస్ నొప్పి అని చెప్పి నీళ్లు తాగి ఉండిపోయాడు. మళ్లీ ఆటలో దిగగా.. ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేయగా కాస్త స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతన్ని గుడ్లవల్లేరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆపరేషన్ థియేటర్‌లో ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు గుడివాడ తీసుకెళ్లాలని సూచించారు. చివరకు గుడివాడ తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.