Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
Crime News: ప.గో జిల్లా యండగండిలో ఇంటికి పార్శిల్‌లో మృతదేహం వచ్చిన ఘటనపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.
Police Investigation In Deadbody Parcel Case In Yendagandi: పశ్చిమగోదావరి జిల్లా (Westgodavari District) ఉండి మండలం యండగండి (Yendagandi) గ్రామంలో ఓ ఇంటికి పార్శిల్‌లో మృతదేహం వచ్చిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు శ్రీధర్‌వర్మ తన వదిన సాగి తులసికి చెందాల్సిన ఆస్తిని కాజేయాలనే ఆలోచనతోనే ఈ పథకం రచించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీని కోసం జులై నుంచే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందిస్తున్నట్లు కథ నడిపించాడు. అదే క్రమంలో పార్శిల్‌లో శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. శవానికి బదులుగా కోడ్ భాషగా 'చేప దొరికిందా.?' అని మాట్లాడుకునే వారని సమాచారం. తులసికి శవాలంటే భయమని.. కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులకు తెలిసే ఛాన్స్ ఉండదని పోలీసులు భావిస్తున్నారు.
శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా.?
ముందుగా ఎక్కడి నుంచైనా శవాన్ని తేవాలని ప్రయత్నించారని.. అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను చంపేశారని తెలుస్తోంది. అతన్ని కారులో ఎక్కించుకుని ఉండి మండలం పెదపుల్లేరు దారిలో వెళ్లారని.. కారులోనే హతమార్చినట్లు సమాచారం. కాగా, మృతుడు బర్రె పర్లయ్య కూలి పనులు చేస్తూ జీవించేవాడని.. నా అనే వారు లేకపోవడంతో ఏ ఊరిలో పని చేస్తే అక్కడే ఆ ఇంటి అరుగు మీదే పడుకునేవాడని పోలీసులు తెలిపారు. 'అసలు ఎందుకు పర్లయను హత్య చేశారు.? అతన్ని హత్య చేస్తే శ్రీధర్ వర్మకు కలిగే లబ్ధి ఏంటి.?' అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.
ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు...
బర్రె పర్లయ్యను ఈ నెల 17న హత్య చేసి ఉంటే 19వ తేదీ వరకూ మృతదేహాన్ని ఎక్కడ దాచారు.?, శవాన్ని పార్శిల్ చేసి తులసిని బెదిరిస్తే వచ్చే ఆస్తిని ఎంతమంది కాజేయాలనుకున్నారు.? వంటి ఎన్నో చిక్కుముడులు వీడాల్సి ఉంది. శవాన్ని పంపిన అనంతరం ఈ నెల 20 నుంచి అదృశ్యమైన శ్రీధర్‌వర్మను మచిలీపట్నం సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. తులసికి ఉన్న మూడెకరాల ఆస్తిపై కన్నేసింది అతనేనా..? లేక దీని వెనుక వేరే ఎవరైనా ఉన్నారా.? అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. 2, 3 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ నయీంఅస్మీ తెలిపారు.
అసలేం జరిగిందంటే.?
ప.గో జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళకు గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె అప్లై చేసుకోగా.. తొలి విడతలో టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేయగా.. పార్శిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ సామగ్రి ఉంటుందని భావించి ఓపెన్ చేయగా మృతదేహం కనిపించింది. దీంతో మహిళతో పాటు షాకైన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Nandyal News: కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?