Shadnagar CI Suspension | దళిత మహిళపై పోలీసులు దాడి, షాద్‌నగర్ సీఐతో పాటు ఐదుగురు సస్పెండ్
Telangana Crime News | రంగారెడ్డి షాద్ నగర్ లో చోరీ కేసులో దళిత మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
Shadnagar CI and five constables suspended | షాద్‌నగర్: దళిత మహిళను చోరీ కేసులో అరెస్ట్ చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులైన పోలీసులపై చర్యలు చేపట్టారు. దళిత మహిళను పీఎస్‌కు తీసుకెళ్లి కొట్టిన షాద్ నగర్ సీఐ రాంరెడ్డిని హైదరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. మరో ఐదుగురు కానిస్టేబుల్స్ పై సైతం సస్పెన్షన్ వేటు వేశారు. దళిత మహిళ సునీతను పీఎస్ కు తీసుకెళ్లి కొట్టిన ఘటనపై షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి విచారణ జరిపించి, నివేదికను సమర్పించారు. రిపోర్ట్ ఆధారంగా షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుల్స్ ను సీపీ అవినాష్ మహంతి సోమవారం నాడు సస్పెండ్ చేశారు.
కొందరు పోలీసుల అత్యుత్సాహంతో అమాయకులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా అటువంటి ఘటనే షాద్ నగర్‌లో చోటుచేసుకుంది. బంగారం చోరీ చేసిందన్న ఆరోపణలతో పోలీసులు దళిత మహిళ సునీతను కొట్టిన ఘటన (థర్డ్ డిగ్రీ ప్రయోగించిన) ఘటన వెలుగుచూసింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
భర్త, కుమారుడి ముందే కొట్టిన పోలీసులు
జులై 24న షాద్ నగర్ లోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు చోరీ చేశారంటూ నాగేందర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత ఆమె భర్త భీమయ్యతోపాటు 13 ఏళ్ల కుమారుడిని పీఎస్ కు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా బాధితురాలు సునీత భర్తను వదిలేసిన డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, కానిస్టేబుల్స్ దళిత మహిళను లాఠీలతో తీవ్రంగా కొట్టారు. భర్త, కుమారుడి ముందే విచక్షణా రహితంగా కొట్టారని, మహిళలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పోలీసుల్ని ఉసిగొల్పుతుందా అని విమర్శలు వెల్లువెత్తాయి. బంగారం చోరీ చేసినట్టు ఒప్పుకోవాలని సీఐ, కానిస్టేబుల్స్ కొట్టడంతో బాధిత మహిళ సునీత స్పృహ కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ నిలిపివేసి, ఆమెను ఇంటికి పంపించేశారు. పోలీస్ స్టేషన్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని సునీత జరిగిన విషయాన్ని వెల్లడించింది. విషయం ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లగా, విచారణకు ఆదేశించి చర్యలు తీసుకున్నారు.
మహిళపై థర్డ్ డిగ్రీ, తీవ్రంగా ఖండించిన కేటీఆర్
దళిత మహిళపై పోలిసుల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? అంటూ పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? మహిళపై ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా? అని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! కొడుకు ముందే చిత్ర హింసలా? రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితి ఉందని ఫైర్ అయ్యారు. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు జరుగుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. మరోవైపు పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.