Crime News: బెంగాల్‌లో మరో దారుణం - ఒంటినిండా గాయాలతో విగతజీవిగా కనిపించిన బాలిక, గ్రామస్థుల ఆందోళన
Bengal News: బెంగాల్‌లో మరో ఘోరం చోటు చేసుకుంది. శుక్రవారం అదృశ్యమైన బాలిక శనివారం ఒంటినిండా గాయాలతో శవమై కనిపించింది. ఈ క్రమంలో గ్రామస్థులు ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు.
Minor Murdered In Bengal: కోల్‌కతా వైద్యురాలి దారుణ హత్యాాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలన కలిగించింది. ఇది మరువక ముందే బెంగాల్‌లో (Bengal) మరో ఘోరం జరిగింది. శుక్రవారం కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగాల్‌లోని సౌత్ 24 పరగణాస్ జిల్లా మహిషామారి గ్రామానికి చెందిన బాలిక కోచింగ్ క్లాస్‌కు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు బాలిక కోసం గాలించగా.. శనివారం తెల్లవారుజామున 3:30 గంటలకు పొలంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
ఒంటినిండా గాయాలతో..
బాలిక ఒంటినిండా గాయాలుండడంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, 19 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడనే అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన బాలిక గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కర్రలతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, అవుట్ పోస్టుకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా.. వారిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు.
బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బెంగాల్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో అమాయక బాలిక ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.