Nirmal News: 10 నిమిషాల్లో ఇంటికి.. ఇంతలో ఘోరం.. పెళ్లి కూతురు, తండ్రి అక్కడికక్కడే మృతి
నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది.
పెళ్లి చేసుకొని ఇంకొద్ది నిమిషాల్లో ఇల్లు చేరతామనేలోపే నిర్మల్ జిల్లాలో ఘోరమైన ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వాహనం ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. కడెం మండలం పాండవ పూర్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు మౌనిక, ఆమె తండ్రి రాజాం అక్కడిక్కడే మృతి చెందారు. పెళ్లి కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్ర బల్లర్షాలోని రాజురా అనే ప్రాంతానికి రిసెప్షన్ కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 10 నిమిషాలలో ఇల్లు చేరుకుంటామనుకునేలోగానే ఈ ప్రమాదం ముంచుకొచ్చింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం పాండవా పూర్ బిడ్జిని ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పెళ్లింట ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది.
Also Read: Theenmaar Mallanna: తీన్మార్ మల్లన్న అరెస్టు.. ఓ జ్యోతిష్యుడి ఫిర్యాదు వల్లే.. అసలేం జరిగిందంటే..
చౌటుప్పల్‌లో మరో దారుణం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో మరో ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న పల్సర్ బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటనతో మృతుల ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. నల్లగొండ చిల్ల చిట్యాల మండలంలోని పిట్టంపల్లికి చెందిన హరీశ్ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు యువకులు హైదరాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. హరీశ్ సొంత ఊరిలో వివాహం ఉండడంతో వీరు ముగ్గురు హైదరాబాద్ నుంచి బైక్‌పై వచ్చారు.
వివాహం పూర్తి అయిన తర్వాత వెంటనే శనివారం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో పిట్టంపల్లి నుంచి హైదరాబాద్‌కు బండిపై బయలు దేరారు. ఈ క్రమంలోనే వీరు ముగ్గురు ధర్మోజీగూడెం మీదుగా వేగంగా వస్తున్నారు. అక్కడ ఉన్న ఓ వేబ్రిడ్జి వద్ద రివర్స్ గేర్ వేసి వెనక్కి వస్తున్న లారీ హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చేయడంతో వీరి బైక్ లారీని ఢీకొట్టింది. దీంతో బైక్ ఒక్కసారిగా కిందపడిపోయింది. వెంటనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.