Viral News: కర్ణాటక నవ దంపతుల మృతి కేసులో ట్విస్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్‌లతో సంచలనం
Karnataka: కర్ణాటకలో నవ దంపతుల మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లూ కీలకంగా మారాయి.
Viral News in Telugu: పెళ్లైన కాసేపటికే గొడవ పడిన జంట గదిలో శవాలై కనిపించారు. కర్ణాటకోలని కోలార్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఎందుకు గొడవ పడ్డారన్నది తెలియకపోయినా ఇద్దరూ రక్తపు మడుగులో కనిపించే సరికి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ మరణాల వెనకాల కచ్చితంగా మూడో వ్యక్తి ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఇలా కాసేపటికే చనిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. కోలార్ జిల్లాలోని చండరసనహళ్లికి చెందిన లిఖిత శ్రీ, నవీన్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరవాత ఓ గదిలోకి వెళ్లారు. ఏదో విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. తరవాత గదిలో నుంచి పెద్ద శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. తలుపు బద్దలు కొట్టి చూస్తే ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే..ఇద్దరూ వేట కొడవళ్లతో నరుక్కుని చనిపోయారని ప్రాథమికంగా పోలీసులు చెబుతున్నారు. బంధువులంతా పెళ్లి సందడిలో ఉండగా ఒక్కసారిగా వీళ్లను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ఈ కేసులో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఉంటారన్న అనుమానాలతో పాటు యువకుడే ఆమెపై దాడి చేసి ఆ తరవాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మరో వాదన వినిపిస్తోంది.
పోస్ట్ మార్టం రిపోర్ట్‌లతో అనుమానాలు పెరుగుతున్నాయి. లిఖితశ్రీకి కుడి చేయితో పాటు మెడకు తీవ్ర గాయాలయ్యాయి. నవీన్‌కి తల వెనక భాగంలో తీవ్ర గాయాలు కనిపించాయి. ఈ రిపోర్ట్ ప్రకారం..ముందుగా లిఖిత శ్రీపై దాడి జరిగిందని తేలింది. ఆ తరవాత నవీన్ కొడవలితో తనపై తానే దాడి చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని వైద్యులు ప్రాథమికంగా చెబుతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు హత్య, ఆత్మహత్య కేసులుగా నమోదు చేశారు. ప్రస్తుతానికి ఇద్దరి అంత్యక్రియలూ పూర్తయ్యాయి. విచారణ కొనసాగిస్తున్న పోలీసులు ఇద్దరి మొబైల్ ఫోన్స్‌నీ పరిశీలిస్తున్నారు. వాళ్ల మానసిక స్థితిపైనా ఆరా తీస్తున్నారు. ఈ గొడవకు ముందు ఫోన్‌లో ఎవరితోనైనా మాట్లాడారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే..లిఖిత శ్రీ మరో యువకుడితో వాట్సాప్‌లో చాట్ చేసిందని, ఇది చూసే నవీన్ దాడి చేశాడని కొందరు చెబుతున్నారు. ఇందులో నిజమెంత అన్నది నిర్ధరణ కాలేదు.