Mukesh Chandrakar: గుండెను చీల్చి బయటకు తీశారు - కాలేయం 4 ముక్కలైపోయింది, జర్నలిస్ట్ ముఖేశ్ హత్య కేసులో సంచలన విషయాలు
Crime News: ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ దారుణ హత్య కేసులో కీలక నిందితుడిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ముఖేష్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు నివ్వెరపోయారు.
Journalish Mukesh Chandrakar Murder Case Accused Arrested: ఛత్తీస్‌గఢ్‌లో (Chattisgarh) సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ (Mukesh Chandrakar) దారుణ హత్య సంచలనం సృష్టించింది. రోడ్డు కాంట్రాక్టులో అవినీతిని బయటపెట్టినందుకు అతన్ని దుండుగులు కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో కీలక నిందితుడిని పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ముఖేష్ మృతదేహానికి పోస్టుమార్టం ముగించిన వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు. తమ 12 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి భయానక హత్యను ఎన్నడూ చూడలేదని.. ఇద్దరు కంటే ఎక్కువ మందే ఈ హత్యలో పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. హంతకులు ముఖేష్‌ను దారుణంగా కొట్టి గుండెను చీల్చి బయటకు తీసినట్లు శవ పరీక్షల్లో తేలింది. అతని కాలేయం 4 ముక్కలైనట్లు గుర్తించారు. తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయని.. పక్కటెముకలు 5 చోట్ల విరిగాయని నిర్ధారించారు.
అవినీతిని బయటపెట్టాడనే..
ఛత్తీస్‌గఢ్ బస్తర్‌కు చెందిన ముఖేష్.. అదే ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకూ రూ.120 కోట్లతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కథనం ప్రసారం చేశాడు. తొలుత రూ.50 కోట్ల టెండర్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టు.. పూర్తిస్థాయి అవినీతి జరగకపోయినప్పటికీ రూ.120 కోట్లకు చేరుకుందని తెలిపాడు. ఇది జరిగిన తర్వాత అతను అదృశ్యమయ్యాడు. ఈ నెల 1 రాత్రి ఇంటి నుంచి వెళ్లిన ముఖేశ్ అదృశ్యం కాగా.. ఆయన సోదరుడు యుకేష్ చంద్రకర్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. విచారణలో బీజాపూర్‌లోని రోడ్డు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్ ఇంటి ఆవరణలోని సెప్టిక్ ట్యాంకులో శవమై కనిపించాడు. పచ్చబొట్టు ఆధారంగా అతన్ని గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో రితేష్, దినేష్‌లు మృతుడికి బంధువులే.
కీలక నిందితుడి అరెస్ట్
ఈ కేసులో కీలక నిందితుడైన కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ముఖేష్‌కు దూరపు బంధువు. హత్య జరిగిన రోజు నుంచి సురేశ్ కూడా అదృశ్యం కావడంతో పోలీసులు అతనిపై నిఘా వేశారు. చివరకు హైదరాబాద్‌లో తన డ్రైవర్ ఇంట్లో నక్కినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 200 సీసీ కెమెరాలు, 300 మొబైల్ నెంబర్లపై నిఘా వేసి నిందితున్ని పట్టుకున్నారు. ఇప్పటికే సురేశ్‌కు చెందిన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి.. అక్రమంగా నిర్మిస్తోన్న యార్డును ధ్వంసం చేశారు. అతని భార్యను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
33 ఏళ్ల ముఖేష్ చంద్రకర్ అనేక వార్తా ఛానల్స్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌లోని తకల్‌గూడ నక్సల్స్ ఆకస్మిక దాడిలో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను మావోయిస్టుల చెర నుంచి విడిపించడంలో కీలక పాత్ర పోషించారు. 'బస్తర్ జంక్షన్' పేరిట ముఖేష్ నిర్వహిస్తోన్న యూట్యూబ్ ఛానల్‌కు 1.59 లక్షల మంది సబ్‌స్కైబర్లు ఉన్నారు. ముఖేష్‌ను దారుణంగా చంపిన వారికి మరణశిక్ష విధించాలని జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. 4 వారాల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ తెలిపారు.
Also Read: School Bus Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా, బ్రేకులు వేసినా కంట్రోల్ కాలేదు