School Bus Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా, బ్రేకులు వేసినా కంట్రోల్ కాలేదు
బుచ్చిరెడ్డిపాలెం: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా పడింది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సాల్మాన్ పురం మినగల్లు గ్రామాల మధ్యలో నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన శ్రీ నికేతన్ స్కూల్ బస్సు బోల్తా పడి కాలువలోకి దూసుకెళ్లింది.
అసలేం జరిగిందంటే..
నెల్లూరు వైపు నుండి మినుగల్లు గ్రామానికి వెళ్లిన స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో రోడ్డుపై గుంతలు ఉండడంతో డ్రైవర్ బ్రేక్ వేసినా స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఆ సమయంలో స్కూల్ బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు, పలువురు గ్రామస్తులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని విద్యార్థులను బయటకు తీశారు.
మినుగల్లు గ్రామానికి చెందిన విద్యార్థి క్రాంతి సందేశ్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పిలుచుకున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్కూలు యజమాన్యం ప్రమాద ఘటనను చిత్రీకరిస్తున్న మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు పాఠశాల యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కండిషన్ లేని బస్సులను రోడ్లపై తిప్పుడూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ స్కూలు యాజమాన్యంపై వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు.