Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన పెట్రోల్ ట్యాంకర్
Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Jagtial Accident : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని గొల్లపల్లి మండలం గోవిందపల్లి వద్ద జగిత్యాల నుంచి రాజరాంపల్లి వైపు వెళ్తోన్న ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన వారందరినీ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ కి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితులంతా వెల్గటూరు వైపు నుంచి మల్యాల వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ అతి వేగంగా ఆటోను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన వారంతా మల్యాల మండల కేంద్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
చిత్తూరు జిల్లా రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రేణిగుంట టౌన్ లోని భగత్ సింగ్ కాలనీలో కార్తికేయ హాస్పిటల్ లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో మంటలను గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబం వారు కావడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చిన్నారులు మృతి
నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ బిల్డింగ్ పై పోర్షన్ లో నివాసం ఉంటున్న డాక్టర్ రవిశంకర్ కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది లోపల ఉన్న కార్తిక (6), సిద్ధార్థ రెడ్డి (11), రామసుబ్బమ్మ, డాక్టర్ అనంతలక్ష్మిలను బయటకు తీసుకొచ్చారు. వీరిని చికిత్స కోసం డీబీఆర్ ఆసుపత్రికి పోలీసులు, సిబ్బంది తరలించారు. కానీ ఇద్దరు చిన్నారులు అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఊపిరి ఆడకపోవడంతో చిన్నారులు చనిపోయారని తెలుస్తోంది.
డాక్టర్ ప్రాణాలు సైతం దక్కలేదు
కాగా, బిల్డింగ్ లోపల ఉన్న డాక్టర్ రవిశంకర్ రెడ్డి(45) కోసం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అతికష్టమ్మీద డాక్టర్ రవిశంకర్ ను రెస్క్యూ టీమ్ బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. కానీ అప్పటికే మంటల్లో ఆయన శరీరం కాలిపోయిందని పోలీసులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టనున్నారు. మంటల్ని గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో కొందరి ప్రాణాలైనా వారు కాపాడగలిగారని చెబుతున్నారు. ఆసుపత్రిలో భారీ ఎత్తున ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, పిఒపి డిజైన్, అట్టపెట్టెలు ఉండటంతో మరింత వేగంగా మంటలు వ్యాప్తి చెందాయని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు.
Also Read : SI Suspension: బాలికపై అత్యాచారం, ఆపై తల్లీకూతురు ఆత్మహత్య - ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
Also Read : TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య