TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు తాళలేక ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఉరి వేసుకుంటున్న, పిల్లలు జాగ్రత్త అంటూ భార్యకు చెప్పి బలవన్మరణం చెందాడు.
TSRTC Driver Suicide: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ పొద్దటూరు అశోక్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకు ముందే కూలి పనికి వెళ్తున్న భార్యను పొలం వద్ద ఆయన దింపి వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే భార్యకు ఫోన్ చేసి.. నేను ఉరి వేసుకుంటున్న, పిల్లలు జాగ్రత్త అని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. షాక్ అయిన భార్య భర్తకు ఏమైందో తెలియక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే అతడు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంటి తలుపులు తెరిచి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. అప్పటి వరకు బాగానే ఉన్న భర్త సడెన్ గా బలవన్మరణం చేసుకోవడం జీర్ణించుకోలేని ఆ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్థానికుల ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న అశోక్ గత కొంత కాలంగా కార్గో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఆయన నడుపుతున్న బస్సుకు డ్యామేజీ అయింది. దీంతో అధికారులు అతడిని డ్రైవర్ పని నుంచి తొలగించి.. డిపో వద్ద పార్కింగ్ పని అప్పగించారు. పగలు విధులు ఇవ్వాలంటే బస్సు డ్యామేజీకి పెనాల్టీ మొత్తం చెల్లించాలంటూ అధికారులు వేధిస్తున్నారంటూ భార్య లావణ్యకు పలుమార్లు చెప్పాడు. ఇదే విషయంపై చాలా రోజులుగా డల్ గా ఉన్నాడని.. మానసికంగా కుంగిపోయిన తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తన భర్త చావుకు పరోక్షంగా కారణం అయిన అధికారులపై కఠిన తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మేమేం వేధించలేదు.. డ్యూటీ మార్చామంతే!
డ్రైవర్ ఆశోక్ ఈనెల 21వ తేదీన విధులు నిర్వహించి ఇంటికి వెళ్లాడని... 22వ తేదీన అతడికి వారాంతపు సెలవు కావడంతో ఆరోజు రాలేదని మెహదీపట్నం డిపో మేనేజర్ సూర్య నారాయణ తెలిపారు. బస్సు డ్యామేజీ అయిందని తెలిసి 23వ తేదీన పార్కింగ్ వద్ద రాత్రి డ్యూటీ వేసినట్లు వివరించారు. అంతేకాని అతడిని ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని పేర్కొన్నారు. డ్రైవర్ అశోక్ ను మేం వేధించామని చెప్పడం అవాస్తంవం అంటూ చెప్పుకొచ్చారు.
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..
ఇటీవలే మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కూతుర్లకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని వీకర్స్ కాలనీలో ఉంటున్న చెన్నల ధనలక్ష్మి (23), అనే మహిళ తన కూతుర్లు సమన్విత (6), శంకరమ్మ (6నెలల చిన్నారి) లకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తిస్తున్నారు పోలీసులు. పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకుందని, భర్త సాయన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన చెన్నల సాయన్న కుటుంబం బతుకు దెరువు కోసం లక్షేట్టిపేటకు వలసవెళ్లారు. తన భార్య ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో భర్త సాయన్న కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచానామా చేశారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోయవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.