SI Suspension: బాలికకు లైంగిక వేధింపులు, కేసు నమోదు చేయలేదని తల్లీకూతురు ఆత్మహత్య - ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
న్యాయం జరగలేదని తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ఎస్ఐ నిర్లక్ష్యం వహించారని గుర్తించిన ఉన్నతాధికారులు సత్యనారాయణను సస్పెండ్ చేశారు.
Pedavegi SI Suspension: ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడలో విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తల్లీకూతురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో ఎస్ఐ నిర్లక్ష్యం వహించారని గుర్తించిన ఉన్నతాధికారులు సత్యనారాయణను సస్పెండ్ చేశారు. పెదవేగి ఎస్ఐ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీఐజీ ఆదేశాలు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే..
వేగివాడకు చెందిన బాలిక (17) పదో తరగతి చదివి ఇంటి వద్ద ఉంటోంది. దెందులూరు మండలం కొత్తపల్లికి చెందిన తాపీ పనులు చేసే చిట్టిబాబుతో బాలికకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే చిట్టిబాబు ఈనెల 12న బాలికకు మాయమాటలు చెప్పి తన బైక్‌పై ఏలూరుకు తీసుకెళ్లాడు. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను గ్రామంలో అందరికీ చూపిస్తానని బెదిరించాడు. 13వ తేదీ సాయంత్రం బాలికను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాలిక చిట్టిబాబు బైక్ ఎక్కి వెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉంది. అయితే బైకుపై తీసుకెళ్లిన నిందితుడు బాలికను వేధిస్తున్నాడు. భయపడిపోయిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై బాలిక బంధువులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అవమానించేలా మాట్లాడిన ఎస్ఐ..
మైనర్ బాలికకు లైంగిక వేధింపులపై పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేయకపోగా ఎస్ సత్యనారాయణ వారిని అవమానించాడు. కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయడానికి బదులుగా, నువ్వే కూతుర్ని పంపించావు అని అన్నారని, ఎస్‌ఐ తమను దుర్భాషలాడాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందని, ఎస్ఐ సైతం న్యాయం చేకపోగా దూషించారని తీవ్ర మనస్తాపం చెందిన తల్లీకూతుళ్లు ఈనెల 16వ తేదీన కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని చికిత్స కోసం మొదట ఏలూరు ప్రభుత్వాసుపత్రికి, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చివరికి ఇద్దరి ప్రాణాలు దక్కలేదు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం బాలిక, శనివారం ఉదయం ఆమె తల్లి చనిపోవడంతో కుటుంబంలో విషాదం రెట్టింపయింది. చికిత్స పొందుతూ తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయారని బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయకపోగా, కేసు నమోదు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఐ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబం, బంధువులు డిమాండ్ చేశారు.
ఎస్ఐని సస్పెండ్ చేసిన డీఐజీ
తాము ఫిర్యాదు చేసినా చిట్టిబాబుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బంధువులు ఆరోపించారు. బాలిక చనిపోయిన తరువాత పెదవేగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో పాటు తమదే తప్పు అని ఎస్ఐ అనడంతో మనస్తాపంతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారని.. ఇద్దరి మృతదేహాలతో పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. విషయం పెద్దది కావడం, బాధిత కుటుంబం చేస్తున్న ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెదవేగి ఎస్ఐ సత్యనారాయణను డీఐజీ సస్పెండ్ చేశారు.