Hyderabad: ముగిసిన శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ... రూ. 7 కోట్లు తిరిగిచ్చేందుకు అంగీకారం..!
పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి... రూ.7 కోట్లు తిరిగిచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణ సమయంలో ఈ విషయం చెప్పినట్లు సమాచారం.
కిట్టీ పార్టీలతో కోట్లు కొట్టేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. పెట్టుబడుల ముసుగులో మోసాలకు పాల్పడినట్లు ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. శిల్పా చౌదరి మూడు రోజుల కస్టడీ ముగియడంతో సోమవారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కస్టడీలో శిల్పా చౌదరి నుంచి పోలీసులు పలు కీలక వివరాలు సేకరించారు. శిల్పా చౌదరి ఖాతాలో రూ.16 వేలు, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ.14 వేలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెపై నమోదైన మూడు కేసుల్లో రూ.7 కోట్లు మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆ ముగ్గురికి రూ.7 కోట్లు తిరిగిచ్చేస్తానని శిల్పాచౌదరి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దివ్యారెడ్డి, ప్రియదర్శిని, రేణుకారెడ్డిల నుంచి శిల్పా రూ.7 కోట్లకు పైగా తీసుకున్నట్లు కేసులు నమోదయ్యాయి. శిల్పా చౌదరి అమెరికాలో మూడేళ్లపాటు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసింది. అమెరికా నుంచి దేశానికి వచ్చిన ఆమె ఈ మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. రాధికారెడ్డికి రూ.10 కోట్లకు పైగా ఇచ్చినట్టు శిల్పా చెప్పినప్పటికీ ఆధారాలు చూపలేకపోయింది. శిల్పారెడ్డి మోసాలపై నార్సింగ్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
Also Read: సంపన్న మహిళలే టార్గెట్.. ఈమె ఉచ్చులో పడితే అంతే.. ఆ బిల్డప్ మామూలుగా ఉండదు
సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలే టార్గెట్
హైదరాబాద్‌లో కిట్టి పార్టీల పేరుతో కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన వారు కేసులు పెట్టారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ తన భర్త పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారిలా బిల్డప్ ఇస్తూ ప్రముఖులను మోసం చేసింది శిల్పా చౌదరి. తరచూ కిట్టీ పార్టీలు నిర్వహిస్తూ సంపన్నులను టార్గెట్ చేసింది. సినిమా నిర్మాణం పేరుతో కోట్లు వసూలు చేసి నిండా ముంచేసింది. మహేశ్ బాబు సోదరి, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని తమ వద్ద రూ.2.90 కోట్లు మోసం చేసిందని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. హీరో హర్ష్ కనుమల్లి తనను శిల్పా చౌదరి మోసం చేసిందని ఫిర్యాదు చేశాడు. తన వద్ద రూ.3 కోట్లు తీసుకుని ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. హర్ష్ కనుమల్లి ‘సెహరి’ సినిమాలో హీరోగా నటించాడు. శిల్పా చౌదరి బాధితుల్లో సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ఎక్కువగా ఉన్నారు. కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా చౌదరి వారికి ఫేక్ బంగారం, నకిలీ చెక్కులు అంటగట్టింది. హీరో సుధీర్‌బాబు భార్య ప్రియదర్శిని వద్ద రూ.2.90 కోట్లు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. చెక్కు మార్చేందుకు బ్యాంక్‌కు వెళ్లిన ప్రియదర్శినికి అసలు విషయం తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Also Read: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
పెట్టుబడుల పేరుతో మోసాలు
శిల్పా చౌదరి, కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు. పదేళ్లుగా గండిపేటలోని సిగ్నేచర్ విల్లా్లో నివాసం ఉంటున్నారు. శిల్పా చౌదరి తనను తాను సినీ నిర్మాతగా, తన భర్తను రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చెప్పుకొంటారు. తరచూ కిట్టీపార్టీలు నిర్వహిస్తూ టాలీవుడ్ పెద్దలతో దిగిన ఫొటోలను చూపిస్తూ.. ధనిక కుటుంబాల మహిళలను ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు భారీగా వస్తాయని నమ్మిస్తుంటుంది. ఇలా పలువురి నుంచి రూ.కోట్లు వసూలు చేసింది. లాభాలు ఎక్కడ అని అడిగితే ఏళ్లు గడుస్తున్నా మాట దాటవేస్తూ, బెదిరింపులకు దిగడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు.
Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం