Manyam District: తీవ్ర విషాదం - పెళ్లైన కొన్ని గంటల్లోనే నవ వధువు మృతి, ఎక్కడంటే?
Andhrapradesh News: పెళ్లైన కొన్ని గంటల్లోనే నవ వధువు మృతి చెందిన ఘటన పార్వతీపురం జిల్లాలో తీవ్ర విషాదం నింపింది.
Bride Died in Manyam District: ఆ నవ వధువు కాళ్ల పారాణి ఇంకా ఆరలేదు. కల్యాణ మండపంలో బంధువుల సందడి ఇంకా మెదులుతూనే ఉంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా అనుకోని సంఘటన అక్కడి వారిని విషాదంలోకి నెట్టింది. నీరసంగా ఉందని నిద్రలోకి జారుకున్న ఆ వధువు మృత్యుఒడికి చేరడంతో అంతా షాక్ కు గురయ్యారు. పెళ్లైన కొన్ని గంటల్లోనే నవ వధువు కన్నుమూసిన తీవ్ర విషాద ఘటన మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా (Manyam District) మక్కువ (Makkuva) మండలం దబ్బగడ్డ గ్రామంలో అఖిల (20) అనే యువతి వివాహం శుక్రవారం రాత్రి 10 గంటలకు జరిగింది. వివాహ క్రతువు ముగిసిన వెంటనే నీరసంగా ఉందని వధువు నిద్రలోకి జారుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఆందోళనకు గురై ఆమెను వెంటనే మక్కువ హీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లైన కొన్ని గంటల్లోనే ఇలా జరగడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.