Chandrababu: 'సీమలో ట్రెండ్ మారింది వైసీపీ బెండు తీస్తారు' - ఐదేళ్లలో కడప జిల్లాకు ఏం చేశావంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్
Andhrpradesh Politics: రాయలసీమలో ట్రెండ్ మారిందని.. ఇక్కడి ప్రజలు వైసీపీ బెండు తీసేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు.
Chandrababu Speech in Proddutur Meeting: వచ్చే ఎన్నికల్లో 'క్విట్ జగన్.. సేవ్ రాయలసీమ' అనేది నినాదం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం భాగంలో కడప జిల్లా ప్రొద్టుటూరులో (Proddutur) శనివారం నిర్వహించిన 'ప్రజాగళం' (Prajagalam) సభలో ఆయన ప్రసంగించారు. సీమలో ట్రెండ్ మారిందని.. ప్రజలు ఇక వైసీపీ బెండు తీసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. పులివెందుల ప్రజలు కూడా జగన్ ను నమ్మేది లేదంటున్నారని.. ఆయన ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. 'జగన్ కు రాయలసీమ అంటే హింస, హత్యా రాజకీయాలు. టీడీపీకి మాత్రం సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడం, పెట్టుబడులు, రైతును రాజు చేయడమే మా సంకల్పం. కడపకు స్టీల్ ప్లాంట్ వచ్చి ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ అలా జరగలేదు. శంకుస్థాపనలు కాదు.. ప్రారంభోత్సవాలు జరగాలి. జగన్ బ్రాండ్ వేసిన స్టీల్ ప్లాంట్ కు మళ్లీ శంకుస్థాపన చేయడం.. పరిశ్రమలు తేకపోగా ఉన్న వాటిని తరిమేయడం అయితే, నా బ్రాండ్ కియా మోటార్స్ తీసుకురావడం. టీడీపీ అధికారంలో ఉంటే ఎప్పుడో స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేవాడిని.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
'రతనాల సీమగా మారుస్తా'
రాయలసీమకు నీళ్లిస్తే కోనసీమ కంటే మిన్నగా తయారవుతుందని.. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని చంద్రబాబు అన్నారు. జగన్ కు నీటి విలువ, ప్రాజెక్టుల గురించి తెలుసా.? అని ప్రశ్నించారు. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకు రావాలనేది తన కల అని అన్నారు. 'పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకురావాలి. ఆ సంకల్పంతోనే 72 శాతం పనులు పూర్తి చేశాం. ఈ ఐదేళ్లలో రాయలసీమలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా.?. ఇలాంటి అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
'వారిది వెన్నెల్లో.. మాది ఎండల్లో మీటింగ్'
వైసీపీది వెన్నెల్లో మీటింగ్ అని.. మాది ఎండల్లో మీటింగ్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మీటింగులకు వెళ్లే వారికి బిర్యానీ, క్వాటర్ బాటిల్ ఇస్తున్నారని ఆరోపించారు. 'కడప ఎవరి ఇలాకా కాదు. వైసీపీ నేతల దాడులకు టీడీపీ కార్యకర్తలు భయపడలేదు. ఆందోళన చెందకుండా పోరాటం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని టీడీపీ ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాం. సీఎం జగన్ పులివెందులకు చేసింది శూన్యం. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత సీఎంకు లేదు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగింది. నేను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాను. మత్తు పదార్థాలు సరఫరా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతాం.' అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Also Read: AP Congress : ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గ్యారంటీల అమలు - సోమవారం అభ్యర్థుల ప్రకటన !