Bhadradri Crime News: సిగరెట్ కోసం స్నేహితుడిని చంపిన యువకుడు, మరీ ఇంత దారుణమా !
Bhadradri Crime News: కష్టాల్లో ఒకరికొకరు సాయంగా ఉండాల్సిన స్నేహితులు సిగరేట్ కోసం గొడవ పడ్డారు. తీవ్ర కోపోద్రికుడైన ఓ యువకుడు తన దోస్త్ ప్రాణాలను తీసేశాడు.
Bhadradri Crime News: కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులకే ఎక్కువ విలువ ఇస్తుంటారు చాలా మంది. ఇంట్లో చెప్పుకోలేని ప్రతీ సమస్యను మిత్రులతో పంచుకుంటారు. ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పంచుకోవాల్సిన స్నేహితులు.. పది రూపాయల విలువ చేసే సిగరేట్ కోసం గొడవ పడ్డారు. గొడవ మాత్రమే కాదండోయ్.. చివరికి ఒకరి ప్రాణాలు పోయాయి. అయితే ఈ ఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
సిగరేట్ గొడవతో.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న యువకులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం గాజులరాజం బస్తీకి చెందిన సందీప్ అలియాస్ బాబీ(23), అదే ప్రాంతానికి చెందిన జగడం సాయిలు చిన్ననాటి నుంచి మిత్రులు. అయితే ప్రతిరోజూ లాగే ఈరోజు కూడా వీరిద్దరూ కలిసి బస్తీలోని ఆర్కే సూపర్ మార్కెట్ పక్కన ఉన్న గల్లీలో సిగరేట్ తాగారు. ఇదే విషయమై ఇద్దరికీ గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. అయితే విచక్షణా జ్ఞానం కోల్పోయిన సాయి.. బాబీపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. పిడి గుద్దులు గుద్దాడు. విషయం గుర్తించిన స్థానికులు అక్కడకు వచ్చి వారిని ఆపి వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వీళ్లు మాత్రం ఆగలేదు. జనాలు ఎక్కువయ్యే సరికి వారిద్దరూ కొట్టుకోవడం ఆపారు. అయితే అప్పటికే బాబీకి తీవ్ర గాయాలు కావడంతో.. అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.
పోలీసుల నిఘా లేదని విమర్శలు..
విషయం గుర్తించిన స్థానికులు బాబీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందతూ మృతి చెందాడు. సిగరెట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల కాలంలో కొత్తగూడెం పట్టణంలో అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయి. పోలీసుల నిఘా కరువవడంతో నిర్మాణుష్య ప్రాంతాల పాటు రద్దీ ప్రాంతాల్లో సైతం అల్లరి మూకల ఆగడాలు పెరిగిపోయాయని స్థానికులు అంటున్నారు. దీంతోపాటు గంజాయికి యువకులు ఎక్కువగా అలవాటుపడ్డారని ఈ క్రమంలోనే తరుచూ పట్టణంలో గొడవలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఇద్దరి స్నేహితుల మద్య సిగరెట్ విషయంలో జరిగిన గొడవ ఒకరి మృతికి కారణం కావడం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో సంచలనంగా మారింది.
సిగరెేట్ రేపిన చిచ్చు- తిరుపతిలో నిండు ప్రాణం బలి !
క్షణికావేశంతో నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న సమస్యల కారణంగానే ఒకరి ప్రాణాలను మరొకరు తీసుకుంటున్న పరిస్థితి. ఆవేశంలో ఏం చేస్తున్నామో అనే విచక్షణ కోల్పోయి ఎదుటి వ్యక్తిపై దాడులు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. స్నేహితులైనా పొరుగింటి వారితోనైనా కయ్యానికి దిగితే కర్కశంగా వ్యవహరించి ఆయువును గాలిలో కలిపేస్తున్నారు కొందరు. తాజాగా శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చిన తమిళ భక్తుల మధ్య సిగరెట్ చిచ్చు రేపింది. సమస్య చిన్నదే అయినప్పటికీ క్షణికావేశంతో చేసిన దాడిలో భక్తుడు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన అలిపిరి పాత చెక్ పాయింట్ లో చోటు చేసుకుంది.