Crime News: నాకాబందీ జరిగిన గంటల్లోనే ఏటీఏంలో చోరీ, జీడిమెట్ల పోలీసులకు సవాల్ విసిరిన దొంగలు
Medchal-Malkajgiri ATM Robbery | మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీ నిర్వహించిన 4 గంటల వ్యవధిలో ఏటీఎంలో చోరీ జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు పోలీసులకు సవాలు విసిరారు. నిన్న (జులై 8న) రాత్రి బాలానగర్ ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. అనంతరం అదే ఏరియాలో 4 గంటల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో చోరికి పాల్పడ్డారు. మార్కండేయ నగర్ లో ఉన్న హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ఏటిఎంలో చోరీ చేశారు. గ్యాస్ కట్టర్స్ సహయంతో ఏటిఎం మిషన్ లో డబ్బులు అప్‌లోడ్ చేసే బాక్సును దొంగలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు నాకాబందీ
మేడ్చల్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ నగర్ లో సైబరాబాద్ సీపీ, బాలానగర్ డిసిపి ఆదేశాల మేరకు పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఈ నాకబందీలో 50 మంది పోలీసులతో తనిఖిలు చేపట్టారు. బాల్ నగర్ ఏసిపి నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాహనాలకు సంబంధించిన పత్రాలను మరియు చోరీకి పాల్పడిన వాహనాలు ఏమైనా ఉన్నాయ అని తనిఖీ చేశాం. మైనర్లు వాహనాలు నడిపే వారిని వాహనాలకు ఎలాంటి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశాం. సరైన పత్రాలు తీసుకువచ్చిన వారి వాహనాలను ఇచ్చేస్తామని చెప్పాం. సరైన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 3ఆటోలు,1 కార్ తో పాటు ఓ బెల్ట్ షాప్ లో తనిఖీ చేయగా 20 లీటర్ల మద్యం దొరికింది.

మైనర్లు డైవింగ్ వలన కలిగే నష్టాలను వారి తల్లిదండ్రులకు వివరించాం. స్థానికంగా ఉండే 10 మంది పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చాం. అదే విధంగా వారి తల్లిదండ్రులతో పోలీసులు మాట్లాడారు. ఇకముందు ఎలాంటి గొడవలకు గాని వెళ్లకుండా చూసుకోవాలని, లేకపోతే కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం అవుతాయని వారి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రజల్లో ధైర్యాన్ని పెంచడానికి నాకాబందీ ఏర్పాటు చేశాం. ఈ నాకాబందీలో జీడిమెట్ల సీఐ మల్లేశం, జీడిమెట్ల డిఐ కనకయ్య , డిఎస్ఐ శ్యాం బాబు, ఎస్సైలు, పలువురు కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారని’ బాలానగర్ ఏసిపి నరేష్ రెడ్డి తెలిపారు.























