Road Accidents: ప్రమాదాలకు నిలయంగా గుడిహత్నూర్ జాతీయ రహదారి, వీటిని అరికట్టడం ఎలా..
Gudihathinur Road Accidents | ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూరు రహదారిపై రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు భద్రతా సౌకర్యాలపై పర్యవేక్షణ లేకపోవడం ఓ కారణమని స్థానికులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ వద్ద జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. అతివేగం.. నిబంధనలు పాటించకపోవడం.. తదితర కారణలేమైనా తరచూ గుడిహాత్నూర్ వద్ద జాతీయ రహదారి NH 44తో పాటు ఇతర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రహదారులు నెత్తురోడుతుండగా, విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. బాధిత కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే పోలీసు, రవాణా శాఖాధికారులు హడావుడి చేసి మళ్లీ మరిచిపోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
లారీ ప్రమాదాలు అధికం
జాతీయ రహదారి కొన్ని ప్రాంతాల్లో ఏటవాలుగా ఉండటం, లారీలు అతివేగంగా రావడం, న్యూట్రల్ చేయడంతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే లారీలను రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేస్తుండడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటిని జాతీయ రహదారి అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలో బ్లాక్ స్పాట్లను గుర్తించినప్పటికీ రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోని భోరజ్ చెక్ పోస్టు, గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగోంది, డోంగర్ గావ్, నేరడిగొండ, తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా గుడిహత్నూర్ మండలకేంద్రంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయంలో జాతీయ రహదారి గుండా ఉండే ప్రాంతాలు కుప్టి, బోథ్ ఎక్స్ రోడ్, ఉట్నూర్ ఎక్స్ రోడ్ ప్రాంతాలు సైతం ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి.

భద్రత విషయంపై పర్యవేక్షణ లేకపోవడం
రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రత విషయం తమ పరిధిలోకి రాదని చెబుతుండటం, ఆర్.అండ్.బి. శాఖ వారే పర్యవేక్షిస్తున్నారని పేర్కొనడం.. ఆర్.అండ్.బీ శాఖ అధికారులు రోడ్డు భద్రత విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అయితే జిల్లాలోని జాతీయ రహదారి NH 44 నేరడిగొండ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు ఫోర్ లేన్ హైవేపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి వేళల్లో మితిమీరిన వేగంతో నడపడంతో చిన్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఎన్.హేచ్.ఎ.ఐ అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించినా సరిచేయడం లేదు. సర్వీసు రోడ్లు, అక్కడక్కడా అండర్ పాస్ లు వంటివి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. లారీ, ఐచర్, తదితర భారీ వాహనాల డ్రైవర్లు గుడిహత్నూర్ ధాబా నుండి సీతాగొంది వరకు న్యూట్రల్ చేసి తీసుకెళ్లడంతో స్పీడ్ అదుపు చేయలేక ఇటీవలే ఎన్నో వాహనాలు అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీకొని ప్రమాదాలు జరిగాయి.
అసలు చాలామంది వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు నిబంధనలు పాటించడం లేదు. దీంతోనే తరచూ జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గుడిహత్నూర్ బస్టాండు సమీపంలో రోడ్డుపైనే వాహనాలు నిలపడడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్లో వాహనాలను తీసుకెళ్లడం, తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ఆటోలు, జీపులు, కార్లలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, తదితర కారణాలతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు భద్రత చర్యలు చేపట్టకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. రవాణా శాఖాధికారులు తనిఖీలు నామమాత్రంగా చేపట్టడంతోనే వాహనదారులు నిబంధనలను పాటించడం లేదనే ప్రచారం కోనసాగుతోంది. దీంతోనే అధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాల వివరాలు
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృత్యువాత పడ్డారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. గత 2022లో 234 ప్రమాదాలు జరగగా 137 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023 లో 286 ప్రమాదాలు జరగగా 126 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో 349 ప్రమాదాలు జరగగా 136 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2025 లో గత జూన్ నెల వరకు 137 ప్రమాదాలు జరగగా 51 మంది మరణించారు. 137 మంది క్షతగాత్రులయ్యారు. దీనిపై పోలీసులు జిల్లాలో 20 బ్లాక్ స్పాట్ లను గుర్తించారు.
నేరడిగొండ మండలంలోని దూద్ గండి నుంచి బంధం ఎక్స్ రోడ్ వరకు, లఖంపూర్, రోల్ మామడ, నేరడిగొండ, ఇచ్చోడ మండలంలో రన్ని జిన్నింగ్ మిల్లు ప్రాంతంలో, ఆదిలాబాద్ వైపు వెళ్లే బైపాస్ వద్ద, గుడిహత్నూర్ మండలంలో మన్నూర్, మేకలగండి, ఈద్గా వద్ద, వాగాపూర్ ఎక్స్ రోడ్, సీతాగోంది, మావల మండలంలో దేవాపూర్ చెక్ పోస్టు, మావల బైపాస్, జైనథ్ మండలంలోని పూసాయి వద్ద జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించగా, ఇంద్రవెల్లిలోని ధనోర(బి), సమ్మక్క ఎక్స్ రోడ్, ఏమైకుంట, ఉట్నూర్ లోని పులిమడుగు, పెర్కగూడ, శ్యాంపూర్ లను గుర్తించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో జిల్లా పోలీసులు సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేసి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

అయితే గుడిహత్నూర్ జాతీయ రహదారి విషయంలో ప్రయాణికులు మాత్రం డోంగర్గావ్ సమీపంలోని సర్వీస్ రోడ్డుపనులు త్వరగా పూర్తి చేయాలని రోడ్డుపై ఉన్న బారీ కేడ్ల కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, జాతీయ రహదారి సంబంధిత శాఖ అధికారులు త్వరగా సర్వీసు రోడ్డు పూర్తి చేయాలని కోరుతున్నారు. గుడిహత్నూర్ లో సర్వీసు రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.24 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టిన గుత్తేదారు ఏళ్లుగా పూర్తి చేయకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
గుడిహత్నూర్ నుంచి ప్రభత్వ జూనియర్ కళాశాల వరకు దాదాపుగా 500 మీటర్ల జాతీయ రహదారి మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేసి రెండు వైపులా ఒకే వరుసలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో వేగంగా వచ్చే వాహనాలతో పాటు చిన్నపాటి వాహనాల దారులు భయాందోళనకు గురవుతున్నారు. గుడిహత్నూర్ మండలం పరిధిలో 15 కిలో మీటర్ల మేర తరచూ ప్రమాదాలు జరుగుతాయి. ఆరు నెలల్లో 12 పమాదాలు జరగ్గా నలుగురు మృతి చెందారు.





















