Dhar Gang Crime: 4 రాష్ట్రాలను వణికిస్తున్న ధార్ గ్యాంగ్ అరెస్ట్ - భారీగా బంగారం, నగదు స్వాధీనం
Anantapur Police | 4 రాష్ట్రాలను వణికిస్తున్న ధార్ గ్యాంగ్ సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Andhra Pradesh News | అనంతపురం: అనంతపురం సిటీ శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్ లోని 3 విల్లాస్ లో జరిగిన చోరీ కేసులను అనంతపురం పోలీసులు ఛేదించారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ ఈ చోరీలకు పాల్పడినట్లు అనంతపురం పోలీసులు తేల్చారు. ధార్ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు.
అరెస్టయిన ధార్ గ్యాంగ్ వివరాలు :
1) నారు పచావర్, చడ్ వాడ్ గ్రామం, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం
2) సావన్ @ శాంతియ దుడ్వే, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం
3) సునీల్ , పిపాల్డిల్యా గ్రామం, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రం
** పరారీలో ఉన్న గ్యాంగ్ సభ్యులు : మహబత్, మోట్ల ( ఈ ఇద్దరిదీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లానే)
స్వాధీనం చేసుకున్నవి : సుమారు రూ. 90 లక్షల విలువ చేసే 59 తులాల బంగారు వస్తువులు మరియు వజ్రాలు పొదిగిన ఆభరణాలు మరియు రూ. 19,35,000/- నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లు
స్థానిక శ్రీనగర్ కాలనీ శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్ లోని శివారెడ్డి, రంజిత్ రెడ్డి, శివశంకర్ నాయుడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఇళ్లకు తాళం వేయడంతో ఎవరూ లేనిసమయంలో చొరబడి సుమారు రూ. 2.13 కోట్లు విలువ చేసే బంగారు వస్తువులు, వజ్రాభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు మేరకు స్థానిక 4 వ పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. ఈ దొంగతనాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ రంగంలోకి 4 ప్రత్యేక పోలీసు బృందాలను దింపారు. చోరీలు జరిగిన ఇళ్లల్లో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను పంపి ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్పీ, అనంతపురం అర్బన్ డీఎస్పీలతో పాటు సిసిఎస్ పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను సందర్శించి జరిగిన తీరుపై ఆరా తీశారు. అంతేకాకుండా... ఈ చోరీ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించేందుకు 4 పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు వెళ్లి గాలించారు.
చోరీలు మధ్యప్రదేశ్ ధార్ గ్యాంగ్ పనే :
ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరైన నారు పచావర్, సావన్ మరియు పరారీలో ఉన్న మహబత్, మోట్ల లు మొత్తం నలుగురు కలసి గత నెల 16 వ తేదీన తమ స్వగ్రామం నుండీ దొంగతనాలు చేయాలనే ఉద్ధేశ్యంతో బయల్దేరి ఇండోర్ , ఇటార్చి వరకు బస్సులో... అక్కడీ నుండీ నేరుగా తమిళనాడులోని సేలంకు రైలులో చేరుకున్నారు. అటు నుండీ ధర్మపురికి వెళ్లి 2 బైకులను దొంగలించి బెంగుళూరు మీదుగా దొంగలించిన టూవీలర్లపై పెనుకొండ వైపు బయల్దేరి వచ్చారు. పెనుకొండ సమీపంలో వీరు వస్తున్న బైకులలో ఒక దానికి రిపేరు రావడంతో అక్కడే వదిలేశారు. సమీపంలో ఉన్న ఒక బైకు ను పెనుకొండ సమీపంలో దొంగలించి టూవీలర్స్ పై ఉదయం అనంతపురం చేరుకున్నారు.
పథకం ప్రకారం ప్లాన్ :
అనంతపురం శివారు ప్రాంతమైన రాజహంస స్వీట్ హోమ్స్ లో తాళం వేసిన ఇళ్లపై రెక్కీ చేశారు. ఆ విల్లాస్ లో ఉన్న శివారెడ్డి, రంజిత్ రెడ్డి, శివశంకర్ నాయుడు ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. నారు పచావర్, సావన్ ,మహబత్, మోట్ల లు తెల్లవారుజామున ఆ మూడిళ్లకు తాళాలు పగులగొట్టి ఆ ఇంట్లో చొరబడ్డారు. ఆ ఇళ్లల్లో ఉన్న విలువైన బంగారు, వజ్రాభరణాలు, నగదు ఊడ్చుకెళ్లారు.చోరీలు తర్వాత హైదరాబాద్ కు చోరీ బైకులలో వెళ్లి... దొంగ సొత్తు వాటాలుగా పంచుకుని అనంతలో చోరీలు చేశాక ధర్మపురి, పెనుకొండలలో దొంగలించిన 2 టూవీలర్లలో నలుగురు గ్యాంగ్ అనంతపురం నుండీ హైదరాబాదు వెళ్లారు. ఎత్తుకెళ్లిన సొమ్ము, నగదును అక్కడ వాటాలుగా పంచుకున్నారు.
నారు పచావర్, సావన్ లో హైదరాబాద్ లో ఉంటూ దొంగ సొత్తును విక్రయించే ప్రయత్నం చేయగా కుదర్లేదు... అక్కడ అమ్మడం అసాధ్యమని భావించి దొంగలించిన సొమ్ములను బెంగుళూరులో అమ్మే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ కు చెందిన రిసీవర్ రమేష్ ను ఫోన్లో సంప్రదించి చోరీ సొమ్మును కొనాలని కోరారు. రమేష్ దొంగ సొత్తులను కొనడంలో దిట్ట కావడంతో తనకు కుదరక తన కొడుకైన సునీల్ ను పంపాడు. ఈ ముగ్గురు స్థానిక రాయల్ నగర్ లో బేరం చేసుకుంటుండగా జిల్లా ఎస్పీకి సమాచారం అందింది.
అనంతపురం అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సి.ఐ లు కనుమూరి సాయినాథ్, హేమంత్ కుమార్, జయపాల్ రెడ్డి, ఎస్సైలు రాంప్రసాద్, రాజశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది బృందంగా ఏర్పడి ఆదివారం స్థానిక రాయల్ నగర్ సమీపంలో అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా... అనంతపురం చోరీల్లో పాల్గొన్న మహబత్, మోట్లలు హైదరాబాద్ లో నారు పచావర్, సావన్ లు తో దొంగసొత్తులను వాటాలుగా పంచుకున్న తర్వాత వారి స్వగ్రామానికి వెళ్లారు. రిసీవర్ సునిల్ తండ్రి అయిన రమేష్ కూడా పరారీలో ఉన్నట్లు విచారణలో తేలింది.
4 రాష్ట్రాలలో మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్ :
ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో ధార్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్ గా ఉంటోంది. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురు మరియు పరారీలో ఉన్న ఇద్దరితో పాటు సుమారు 60 మంది దాకా ఈ గ్యాంగ్ లో సభ్యులు ఉంటారు. అయితే ఐదారుగురు కలిసి గ్యాంగ్ గా ఏర్పడి చోరీలు చేస్తారు. వీరంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా టాండ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందిన వారే. వ్యవసాయ కూలీల వృత్తిని జీవనం కోసం ఎంచుకుని ప్రవృత్తి మాత్రం దొంగతనాలు చేయడం వీరికి రివాజుగా మారింది. ప్రధానంగా తాళం వేసిన ఇళ్లను టార్గేట్ చేయడం... పగలు రెక్కీ రాత్రివేళల్లో చోరీలు చేయడం ఈ గ్యాంగ్ కు పరిపాటి. చిన్న వయస్సుల్లోనే పెళ్లిళ్లు చేసుకోవడం, చెడు వ్యసనాలకు అలవాటు పడటం వెరసి డబ్బు సులువుగా సంపాదించాలని చోరీలు ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

