అన్వేషించండి
Murder: మనవడి చేతిలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త.. 73సార్లు పొడిచి చంపిన నిందితుడు
Crime News: ఆస్తి కోసం సొంత తాతనే కత్తితో పొడిచి పొడిచి చంపిన మనవడు. హైదారాబాద్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త,వెల్జాన్ గ్రూప్ అధినేత మృతి

తాతను హత్య చేసిన మనువడు
Source : X
Murder: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు పెద్దలు.. సమాజంలో పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఆస్తి తగదాలతో ప్రముఖ పారిశ్రామికవేత్త(Industrialist), వెల్జాన్(Veljan) గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్‌రావును ఆయన సొంత మనవడే కత్తితో పొడిచి అతి దారుణంగా హతమార్చాడు.
ప్రముఖ పారిశ్రామికవేత్త దారుణహత్య
ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటిచంద్రశేఖర్ జనార్ధన్‌రావు( వీసీ) దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్(Hyderabad)లోని సోమాజిగూడలో ఆయన నివాసంలో కుమార్తె కుమారుడు కీర్తితేజ కత్తితో ఆయన 73 సార్లు పొడిచి చంపాడు. అడ్డుకోబోయిన కుమార్తె పైనా దాడి చేశాడు. ఈఘటనలో చంద్రశేఖర జనార్దన్‌రావు(VC) అక్కడికక్కడే మృతిచెందగా...ఆయన కుమార్తె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
కష్టపడి ఎదిగి …
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు(Eluru) ప్రాంతానికి చెందిన వెలమాటి చంద్రశేఖర్ జనార్దనరావు కష్టపడి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. వివిధ సంస్థలు స్థాపించారు. వెల్జాన్ (Veljan)గ్రూప్ పేరిట మోటార్లు,హైడ్రాలిక్ పంపులు, ప్రెషర్ పంపులు తయారీరంగంలో దాదాపు 55 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన కోట్లాది రూపాయలు సంపాదించారు. ఎన్నో దాతృత్వ సేవల ద్వారా గుర్తింపు పొందిన వీసీ...తన సంపాదనలో ఎక్కువ భాగం దానదర్మాలు చేసేవారు. తన పుట్టిన ప్రాంతమైన ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు విరాళంగా అందజేశారు.అలాగే తిరుమల తిరుపతి(TTD) దేవస్థానానికి సైతం మరో రూ.40 కోట్లు ఇచ్చారు. ఏపీ,తెలంగాణలో పలు స్వచ్ఛంద సంస్థలకు సైతం భారీగా విరాళాలు అందజేశారు. జీవిత చరమాంకంలోకి చేరిన ఆయన తన సంస్థ బాధ్యతలను వారసులకు అప్పగించి విశ్రాంతి తీసుకుందామనుకున్న క్రమంలో ఆస్తి తగాదాలు తలెత్తాయి. ఇటీవల పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణ(Sri Krishna)ను వెల్జాన్ సంస్థకు డైరెక్టర్‌గా నియమించారు. అలాగే మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడు కిలారు కీర్తితేజ(Keerthi Teja)కు రూ.4 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేశారు. దీంతో చిన్న కుమార్తె, మనుమడు కొన్నిరోజులుగా గొడవపడుతున్నారు. ఆస్తిని సమానంగా పంచాలని కోరుతున్నారు. ఈక్రమంలోనే గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడు కీర్తితేజతో కలిసి తండ్రి వద్దకు వచ్చింది. ఆస్తి విషయమై మరోసారి వారిరువురు చంద్రశేఖర జనార్దనరావుతో గొడవపడ్డారు. తాతతో మనవడు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు. ఈక్రమంలో తండ్రికి టీ తెచ్చేందుకు సరోజనీదేవి ఇంట్లోకి వెళ్లగా అదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో తాతను తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు, కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుడిని అడ్డుకుంది. ఆమెపైనా కత్తితో దాడి చేసి నాలుగుచోట్ల పొడిచాడు. పనివాళ్లు అడ్డుకోబోగా వారినీ చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన ఇరువురిని ఆస్పత్రికి తరలించగా...జనార్దన్‌రావు అప్పటికే మృతిచెందగా సరోజనీదేవి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హంతకుడు కీర్తితేజ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతను మాదకద్రవ్యాలకు బానిసయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మత్తులో ఉండబట్టే విచక్షణ కోల్పోయి తాత,తల్లిపై దాడి చేసిఉంటాడని భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన సరోజనీదేవి కోలుకుంటున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















