Anantapur News : అదనపు కట్నం కోసం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వేధింపులు, వివాహిత ఆత్మహత్య!
Anantapur News : ఉరవకొండలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తే తమ కుమార్తెను హత్య చేశారని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు.
Anantapur News : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం... ఉరవకొండ సీవీవీ నగర్ లో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వినోద్ తో శిరీషకు రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఒక సంవత్సరం వయసున్న బాబు కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం శిరీష ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందిందని భర్త తెలిపాడని మృతురాలి బంధువులు చెప్పారు. అయితే శిరీషది ఆత్మహత్య కాదని భర్తే హత్య చేశారని శిరీష తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహ సమయంలో 25 తులాల బంగారం, రెండు లక్షలు నగదు ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించామని శిరీష తల్లిదండ్రులు తెలిపారు. ఆ తర్వాత కూడా శిరీష పేరుపై ఐదు సెంట్ల స్థలాన్ని రిజిస్టర్ చేయించామని, అయితే ఆ స్థలం తన పేరుపై రిజిస్టర్ చేయాలంటూ భర్త వినోద్ వేధింపులకు గురి చేసేవాడని శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు.
సూసైడ్ నోట్ లో
ఈ విషయంపై రెండు మూడు సార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగిందన్నారు శిరీష్ బంధువులు తెలిపారు. అదనపు కట్నంపై ఆశతో శిరీషను భర్తే చంపివేశారని శిరీష తల్లి లక్ష్మీదేవి ఆరోపించింది. ఈ విషయంపై శిరీష మృతదేహం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తింది. అయితే మృతురాలి ఇంట్లో ఒకలేఖ దొరికిందని పోలీసులు తెలిపారు. అందులో తనకు ఎలాంటి ఎఫైర్స్ లేవని కొడుకును బాగా చూసుకో అని రాసి ఉండటం చర్చనీయాంశమైంది. భర్త అనుమానం వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక చంపి ఆత్మహత్యగా? చిత్రీకరిస్తున్నారా? అనే దానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
కేసు నమోదు
"ఉరవకొండలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు తన చెల్లెల శిరీషను ఇచ్చి పెళ్లి చేసినట్లు బుక్కరాయసముద్రానికి చెందిన శివ ప్రసాద్ తెలిపారు. బావ వేధింపులతో తన చెల్లి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదుచేశారు. ఐదు సెంట్ల భూమి తన పేరుపై రాయాలని తన బావ వేధించేవాడని తెలిపాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేశాం. శిరీష భర్త, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అదనపు కట్నం కేసు కాబట్టి తదుపరి విచారణకు డీఎస్పీకి పంపిస్తున్నాం"- పోలీసులు
పరీక్షల భయంతో విద్యార్థిని ఆత్మహత్య
పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. నిజామాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన అందర్నీ విషాదంలో నింపింది. స్థానిక వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని పరీక్షల భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకేసింది. నిజామాబాద్‌లోని వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పదిహేడేళ్ల అక్షిత సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
అక్షిత సూసైడ్ విషయం గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని కాలేజీ సిబ్బందికి చెప్పారు. వెంటనే ఈ స్పందించిన ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అక్షిత మృతి చెందింది. అక్షిత పాలిటెక్నిక్ ఈసీఈ విద్యార్థిని. ఇటీవలే మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆమె ఒక సబ్జెక్ట్‌లో తప్పింది. మొదటి సెమిస్టర్‌లోనే ఒక సబ్జెక్ట్ తప్పిన అక్షితకు పరీక్షలంటేనే భయం పట్టుకుంది. తరచూ తోటి స్నేహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించేది. రేపటి(మంగళవారం) నుంచి రెండో సమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో సూసైడ్ చేసుకుంది. అయితే అక్షిత మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని... పరీక్షలు అంటే ఎప్పుడూ భయపడేది కాదని అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.