Warangal News: ఒక్క రూపాయి కోసం వివాదం - వ్యక్తి మృతి, వరంగల్‌లో ఘటన
Telangana News: రూపాయి కోసం ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి నిండుప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన వరంగల్‌లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Man Died Due To One Rupee In Warangal: ఒక్క రూపాయి.. ఎంత పని చేసింది.?. రూపాయి కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైంది. రూపాయి కారణంగా జరిగిన వివాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ నగరంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని గాంధీనగర్ లో.. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ పాయింట్ వద్ద ఆగి బిర్యానీ కొనుగోలు చేశాడు. అదే సమయంలో అక్కడికి అరవింద్ అనే యువకుడు వచ్చాడు. బిర్యానీ రూ.59 కాగా.. ప్రేమ్ సాగర్ రూ.60 ఫోన్ పే చేశాడు. ఈ క్రమంలో అరవింద్ రూపాయి విషయంలో ప్రేమ్ సాగర్‌ను ఎగతాళి చేయగా.. ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. క్షణికావేశంలో ప్రేమ్ సాగర్‌ను నెట్టేయడంతో కింద ఉన్న రాయి తగిలి అతని తలకు బలమైన గాయమైంది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ప్రేమ్ సాగర్‌తో గొడవ పడ్డ అరవింద్ పరారీలో ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Heat Waves In Telangana: అగ్నిగుండంలా తెలంగాణ, ఎండలకు ఒకే రోజు 13 మంది మృత్యువాత