Apollo Micro Systems Shares: 3 రోజుల్లో 34 శాతం పెరిగిన డిఫెన్స్ స్టాక్, కొంటారా?
ఒక్కొక్కటి రూ.183.30 చొప్పున మొత్తం రూ.185.13 కోట్ల విలువైన వారెంట్లను జారీ చేస్తామని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ కంపెనీ తెలిపింది.
Apollo Micro Systems Shares: ప్రమోటర్లు, నాన్ ప్రమోటర్ గ్రూప్ వ్యక్తులకు ప్రాధాన్యత (ప్రిఫరెన్షియల్) ప్రాతిపదికన వారెంట్లను జారీ చేయడానికి బోర్డు ఆమోదించడంతో, అపోలో మైక్రో సిస్టమ్స్ (Apollo Micro Systems) షేర్లకు రెక్కలు మొలిచాయి. ఇవాళ్టి (శుక్రవారం) ఇంట్రా డే ట్రేడ్‌లో ఈ కంపెనీ స్టాక్ BSEలో 12 శాతం పెరిగి రూ.247.45 కి చేరింది. ఇదే దీని తాజా 52-వారాల గరిష్ట స్థాయి.
ఈ డిఫెన్స్ కంపెనీ షేరు వరుసగా మూడో రోజు కూడా గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. ఈ మూడు రోజుల్లోనే ఇది 34 శాతం ర్యాలీ చేసింది.
2018 ఏప్రిల్ తర్వాత గరిష్ట స్థాయిలో ఈ స్టాక్ ప్రైస్ కోట్ అయింది. అంటే, నాలుగేళ్ల గరిష్టంలో ప్రస్తుతం షేరు ధర కదులుతోంది.
వారెంట్ల జారీ
18 నెలల వ్యవధిలో ఈక్విటీ షేర్లుగా మార్చుకోదగిన 10.10 మిలియన్ వారెంట్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదించినట్లు గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత అపోలో మైక్రో సిస్టమ్స్ ప్రకటించింది. ఒక్కొక్కటి రూ.183.30 చొప్పున మొత్తం రూ.185.13 కోట్ల విలువైన వారెంట్లను జారీ చేస్తామని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ కంపెనీ తెలిపింది.
వారెంట్ల జారీ సమయంలో, మొత్తం ఇష్యూ సైజ్‌లో 25 శాతానికి సమానమైన మొత్తాన్ని ప్రతిపాదిత కేటాయింపుదారులకు ముందుగా కేటాయించాలి. అపోలో మైక్రో సిస్టమ్స్ ప్రమోటర్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కరుణాకర్ రెడ్డి బద్దంకు 4.62 మిలియన్ వారెంట్లను కంపెనీ కేటాయించనుంది. మారిషస్‌కు చెందిన నెక్స్‌పాక్ట్ లిమిటెడ్‌కు (Nexpact Limited) 1.9 మిలియన్ వారెంట్లు, మేబ్యాంక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (Maybank Securities Pvt. Ltd.) 1.2 మిలియన్ వారెంట్లు జారీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రైస్ ట్రెండ్
గత నెల రోజుల్లో, S&P BSE సెన్సెక్స్‌లో 3.5 శాతం క్షీణతకు వ్యతిరేకంగా ఈ షేర్లు 49 శాతం పెరిగి, స్టాక్ మార్కెట్ తలదన్నాయి. అంతేకాదు; గత మూడు నెలల్లో, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లోని 9 శాతం పెరుగుదలతో పోలిస్తే, ఈ స్టాక్ 80 శాతం జూమ్ అయింది. గత ఆరు నెలల కాలంలో 56 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 31 శాతం లాభపడిందీ కౌంటర్.
వ్యాపారం
అపోలో మైక్రోసిస్టమ్స్ ఒక ఎలక్ట్రానిక్, ఎలక్ట్రో-మెకానికల్, ఇంజినీరింగ్ డిజైన్స్, తయారీ, సరఫరా కంపెనీ. అంతరిక్షం & భూ భాగ రక్షణకు సంబంధించిన నాణ్యమైన పరికరాల రూపకల్పన, అభివృద్ధి, విక్రయాలను ఈ కంపెనీ చేస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన డిఫెన్స్ కంపెనీలకు వాటిని అందిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.