KTR BRS Politics: రేవంత్‌కు దమ్ముంటే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్
Revanth Reddy vs KTR | పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని, వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకరని BRS నేత కేటీఆర్ ఎద్దేవా చేశారు.

గద్వాల: గద్వాలలో జరిగిన "గద్వాల గర్జన" సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఎండగట్టారు. సభలో భారీగా హాజరైన ప్రజల మధ్య మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. కాంగ్రెస్‌లోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. “ప్రజల విశ్వాసాన్ని, ఆశల్ని తుంగలో తొక్కి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలపై ప్రజల కోర్టు తీర్పు తప్పదు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందారో చెప్పలేని దుస్థితిలో ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
“పదిమంది ఎమ్మెల్యేలు తమ స్వార్థం కోసం పార్టీ మారారు. వారి లక్ష్యం ప్రజాసేవ కాదు, ఆస్తుల పెంపుదలే. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. ఉపఎన్నికలు తప్పవు. ప్రజలే బుద్ధి చెబుతారు” అని కేటీఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్‌లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతల చేరిక
గద్వాల సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో గద్వాల ముందు నడిచింది. కేసీఆర్ నాయకత్వంలో జిల్లా హోదా, మెడికల్ కాలేజీ, తుమ్మిళ్ల ప్రాజెక్టు వంటి అభివృద్ధి సాధ్యమైందని కేటీఆర్ పేర్కొన్నారు.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని మండిపడ్డారు కేటీఆర్, “పేదల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లానంటారు. అయితే... రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ?. ఆడబిడ్డలకు స్కూటీలు ఎక్కడ?. దళితబంధు 20 లక్షలు ఎక్కడ. బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఏమైంది అని అని వరుస ప్రశ్నలు సంధించారు కేటీఆర్. ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెబుతూనే, కాంగ్రెస్ గూటికి చేరడం దారుణం. అది ఓటు వేసిన ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
“యూరియాను బ్లాక్‌లో అమ్ముకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారింది. గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముడయ్యాయి. ప్రజల నమ్మకాన్ని Congress దుర్వినియోగం చేసింది. కాంగ్రెస్‌లో చేరాల్సి వస్తే రైలుకింద తల పెడతా” అన్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు సభకు రాకపోవడం ఏమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. BRS పార్టీలో ఉన్నామని చెబుతూనే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినదానికి కట్టుబడటం ప్రజలను మోసం చేయడమే అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
“రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనకబడింది. మళ్లీ యూరియా కష్టాలు, కరెంటు కోతలు తిరిగొచ్చాయి. కేసీఆర్ వేశిన పునాది, తెచ్చిన అభివృద్ధిని కాంగ్రెస్ దెబ్బతీసింది. కరోనా టైంలో కూడా రైతుబంధు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు విద్య, సంక్షేమ రంగాల్లో పూర్తిగా వైఫల్యం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని గురుకులాల స్థితిగతులు చూడు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ పరిపాలన విఫలమైంది” అని కేటీఆర్ విమర్శించారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేసి, ఉమ్మడి పాలమూరు (Mahabubnagar) జిల్లాలో 18.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. 22 నెలలు అయినా ఇప్పటిదాకా నిర్మాణ పనులను కొనసాగించకుండా గట్టు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టిందని అన్నారు.
గద్వాల మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరాలి
ఉపఎన్నికలు వస్తే ఎవరి సత్తా ఏమిటో తేలుతుందని.. కానీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్. గద్వాల మున్సిపాలిటీపై గులాబీ జెండా కచ్చితంగా ఎగరాలి అని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.






















