Visnur Ramachandra Reddy: నిజాం పాలనలో ప్రజలను పీడించిన దేశ్‌ముఖ్ విసునూరు రాంచంద్రారెడ్డి ! భూస్వామ్య వ్యవస్థకు చిహ్నం
Telangana Liberation Day on September 17 | నాటి నిజాం పాలనలో భూస్వామ్య ఆగడాలకు చిహ్నంగా విస్నూరు రాంచంద్రారెడ్డి ఉండేవారు. వేల ఎకరాలను ప్రజల నుండి లాక్కుని తన పేరును రాయించుకునేవారు.

Hyderabad Liberation Day | తెలంగాణ చరిత్ర రాయాలంటే, అందులో భూస్వాముల దోపిడీ వ్యవస్థ కోసం చాలా పేజీలు కేటాయించాలి. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు ఈ భూస్వాముల ఉక్కు పిడికిలిలో నలిగిపోయేవారు. నిజాం నిరంకుశ పాలనలో ఈ భూస్వామ్య వ్యవస్థ చాలా కీలకంగా పనిచేసేది. నిజాం ప్రభువుకు కళ్లు, చెవులు అన్నీ ఈ భూస్వాములే. అయితే, నిజాం నాటి కాలంలో వందలాది భూస్వాములు ఉన్నప్పటికీ, విసునూరు రాంచంద్రారెడ్డి (Rapaka Ramachandra Reddy) పేరు మారుమోగిపోయేది. తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యవస్థకు రాంచంద్రారెడ్డి ఓ ప్రతీక. ప్రజలను అణిచివేసిన తీరుకు రాంచంద్రారెడ్డి నిదర్శనం. అసలు ఈ రాంచంద్రారెడ్డికి నిజాం పాలకులు ఎందుకు అంత స్వేచ్ఛ ఇచ్చారు? ఆయనకున్న అధికారాలు ఏంటి? అన్న విషయాలు ఈ కథనం విపులంగా వివరిస్తుంది. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీ కోసం.
రాంచంద్రారెడ్డి భూస్వామి మాత్రమే కాదు, దేశ్ ముఖ్ కూడా...
నిజాం పాలనలో విస్నూరు రాంచంద్రారెడ్డి భూములు ఉన్న భూస్వామి మాత్రమే కాదు. ఆయన నిజాం ప్రభుత్వం నుండి "దేశ్ ముఖ్" అనే బిరుదును అందుకున్నారు. జనగామ జిల్లా, పాలకుర్తి మండలంలోని గ్రామం విసునూరు. రాంచంద్రారెడ్డి బాల్యం గురించి పూర్తి వివరాలు చారిత్రాత్మకంగా అందుబాటులో లేవు. కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఆయన చేసిన ఆగడాలు, దౌర్జన్యాల కారణంగా విస్నూరు రాంచంద్రారెడ్డి పేరు మారుమోగిపోయింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి వారు విస్నూరు రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడడం వల్ల ఆయన పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.
నిజాం పాలకులు చాలా మంది భూస్వాములను తమ ప్రతినిధులుగా నియమించుకునేవారు. వారిలో కొందరికి దేశ్ ముఖ్ అని బిరుదును ప్రదానం చేసేవారు. "దేశ్ ముఖ్" అంటే ప్రాంతానికి అధిపతి అని అర్థం. నిజాం పాలకులు వారసత్వంగా, సామాజికంగా, ఆర్థికంగా, పలుకుబడి ఉన్న వారిని ఎంపిక చేసి వారిని దేశ్ ముఖ్లుగా నియమించుకునేవారు. వీరు నిజాం పాలనకు విధేయత చూపుతూ కొన్ని గ్రామాలు లేదా తాలూకాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు. వీరు ప్రధానంగా మూడు రకాల విధులు నిర్వర్తిస్తారు.

1. శిస్తు వసూలు: నిజాం ప్రభుత్వం తరఫున దేశ్ ముఖ్లు ప్రజల నుండి పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ప్రజల నుండి వీరు పన్నులు వసూలు చేసి నిజాం ఖజానాకు పంపేవారు. విసునూరు రాంచంద్రారెడ్డి కూడా తన భూముల్లో పని చేసేవారి నుండి పెద్ద మొత్తంలో శిస్తును వసూలు చేసేవాడు.
2. తగాదాల పరిష్కారం: పన్నులు వసూలుతో పాటు, స్థానికంగా ఏర్పడే గొడవలు, తగాదాలను పరిష్కరించే అధికారం నిజాం పాలకుల నుండి దేశ్ ముఖ్లకు ఇవ్వబడింది. ఈ విశేష అధికారాన్ని వినియోగించుకునే రాంచంద్రారెడ్డి పలు ఆగడాలకు పాల్పడేవాడు. రైతులను, కూలీలపై దౌర్జన్యం చేసేవాడు. వారి నుండి ఆస్తులను కాజేసేవాడు. ఇలా ఆ ప్రాంతంలోని భూమిని అంతటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు.
3. పోలీసు అధికారాలు: దేశ్ ముఖ్లకు సొంత సైన్యం ఉండేది. వీరికి రజాకార్లు తోడుగా ఉండేవారు. నిజాంకు గానీ, దేశ్ ముఖ్లకు గానీ ఎవరు ఎదురు తిరిగినా వారిని పట్టుకుని హింసించేవారు. అనేక గ్రామాలపై బడి దోచుకునేవారు. గ్రామాలకు గ్రామాలు తగులబెట్టేవారు. మహిళలపై అత్యాచారాలకు దిగేవారు. తమ మాట విననివారిని భౌతికంగా మట్టుబెట్టేవారు. వారి శవాలు కూడా కనిపించకుండా చేసేవారు. ఇంతటి అధికారం కారణంగా విసునూరు రాంచంద్రారెడ్డి అనేక హింసాత్మక సంఘటనలకు కారణం అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ దేశ్ ముఖ్లు నిజాం పాలనలో ఓ భాగంగా ఉన్నారు. ప్రజలకు నేరుగా నిజాం నవాబులకు తమ కష్టాలు చెప్పుకునే అవకాశం లేదు. వీరి నుండి పన్నులు వచ్చేవి. శాంతిభద్రతలను దేశ్ ముఖ్లే చూసుకునేవారు. రజాకార్ల వ్యవస్థ కూడా నిజాంకు విధేయులుగా ఉండి, భూస్వాములకు అనుకూలంగా పని చేస్తూ ప్రజలపై హింసకు దిగేవారు. ఈ కారణంగా దేశ్ ముఖ్లు, భూస్వాములు ఆనాడు రెచ్చిపోయే పరిస్థితి ఉండేది.
తీవ్ర అణిచివేతకు దిగిన రాంచంద్రారెడ్డి, తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య
నాటి నిజాం పాలనలో భూస్వామ్య ఆగడాలకు చిహ్నంగా విస్నూరు రాంచంద్రారెడ్డి ఉండేవారు. వేల ఎకరాలను ప్రజల నుండి లాక్కుని తన పేరును రాయించుకునేవారు. పండించిన పంటలను పన్ను పేరుతో అతని మనుషులు ఎత్తుకుపోయేవారు. ఇలాంటి పరిస్థితిలో చాకలి ఐలమ్మ, రాంచంద్రారెడ్డి పంపిన గుండాలను తరిమికొట్టి తన పంటను కాపాడుకున్నారు. ఈ సంఘటన ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఈ సంఘటనతో చాలా మంది రాంచంద్రారెడ్డి దౌర్జన్యాలను వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే దొడ్డి కొమరయ్య రాంచంద్రారెడ్డి గుండాల కాల్పుల్లో మరణించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమించారు. వీరి పోరాట స్ఫూర్తితో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం పురుడుపోసుకుంది. ఇలా తీవ్ర అణిచివేతకు నిదర్శనంగా రాంచంద్రారెడ్డి ఓ వైపు నిలిస్తే, భూస్వామ్య వ్యవస్థ పతనం కూడా అతని ద్వారానే ప్రారంభం కావడం విశేషంగా చెప్పాలి. రాంచంద్రారెడ్డి నిరంకుశ వ్యవహారాన్ని కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, "మా భూములు మాకే" అన్న నినాదంతో పెద్ద పోరాటాన్నే నిర్వహించారు.
రాంచంద్రారెడ్డే కాదు, ఆయన కుటుంబానిది కూడా...
రాంచంద్రారెడ్డితో పాటు ఆయన భార్య జానకీ బాయి కూడా ఈ అణిచివేతలో భాగస్వాములుగా ఉన్నారని చరిత్రకారులు చెబుతారు. వెనుకబడిన వర్గాలను వేధించేవారని, వారి కుమారులు కూడా మహిళలపై అత్యాచారానికి దిగేవారని చెబుతారు. విస్నూరు దేశ్ ముఖ్ కుటుంబం మొత్తం ప్రజలను అణిచివేసే భూస్వామ్య వ్యవస్థగా నాడు పనిచేసినట్లు నాటి ఉద్యమకారులు చెబుతారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో విస్నూరు దేశ్ ముఖ్ పాలన ఓ కీలక ఘట్టంగా ఆవిష్కరించబడింది. అందుకే నేటికీ తెలంగాణ చరిత్రలోకి చూస్తే, విస్నూరు రాంచంద్రారెడ్డి వ్యవహారం చాలా ముఖ్యమైన ఘట్టాలుగా చెప్పబడతాయి.





















