LPG Insurance Cover: ఎల్పీజీ కనెక్షన్ తీసుకుంటే బీమా ఎంత లభిస్తుంది.. ఎంత క్లెయిమ్ చేయవచ్చు
LPG connection rules | కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్నా, పాతది రెన్యువల్ చేసినా ఆ వినియోగదారులకు బీమా వస్తుంది. ఎలాంటి ఫారం నింపనవసరం లేదు, ప్రీమియం కూడా చెల్లించాల్సిన పనిలేదు.

LPG Insurance | భారతదేశంలో దాదాపుగా అందరి ఇళ్లలో వంట గ్యాస్ ఎల్పీజీ సిలిండర్ వాడుతున్నారు. ప్రభుత్వ ఉజ్వల యోజన, ఇతర ప్రభుత్వ పథకాల తరువాత, ఎల్పిజి సిలిండర్ల (LPG cylinder) లభ్యత పట్టణాల నుంచి గ్రామాలకు పెరిగింది. అయితే, గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు వినియోగదారులకు లక్షల రూపాయల ఉచిత బీమా కవర్ కూడా లభిస్తుందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
ప్రమాదం జరిగినప్పుడు ఈ బీమా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది. కాబట్టి, గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఎంత బీమా లభిస్తుందో, అలాగే గ్యాస్ కనెక్షన్ గురించి మీరు కొన్ని విషయాలు ఎందుకు తెలుసుకోవాలి అనేది ఇక్కడ అందిస్తున్నాం.
ఎంత బీమా లభిస్తుంది?
కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు లేదా పాతది రెన్యూ చేసినప్పుడు, వినియోగదారులకు ఆటోమేటిక్‌గా ఒక నిర్దిష్ట బీమా కవర్ లభిస్తుంది. దీని కోసం ప్రత్యేకంగా ఫారమ్ నింపాల్సిన అవసరం లేదు. లేదా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఆయిల్ (Indian Oil), భారత్ గ్యాస్, హెచ్‌పి గ్యాస్ వంటి కంపెనీలు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ బీమా గ్యాస్ లీక్, అగ్నిప్రమాదం లేదా సిలిండర్ పేలడం వంటి ప్రమాదాలలో జరిగే నష్టాన్ని భర్తీ చేస్తుంది. గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు దాదాపు 50 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కవర్ లభిస్తుంది. ఇందులో కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10 లక్షల రూపాయల వరకు కవర్ లభిస్తుంది. మొత్తం కుటుంబానికి గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కల్పించనున్నారు.
ఆస్తి నష్టం జరిగితే 2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరైనా మరణించిన సందర్భంలో 6 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద కవర్ లభిస్తుంది. దీంతో పాటు, చికిత్స కోసం గరిష్టంగా 30 లక్షలు లభిస్తాయి. అంటే ఒక్కొక్క సభ్యునికి రెండు లక్షల రూపాయలు. ఈ బీమా మొత్తం నేరుగా కుటుంబానికి చెల్లించనున్నారు. అయితే గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, పైపులు, స్టవ్ ISI మార్క్ కలిగి ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.
ఈ రూల్స్ వర్తిస్తాయి
గ్యాస్ కనెక్షన్ పై బీమా ప్రయోజనాన్ని పొందాలంటే, వినియోగదారులు కొన్ని నియమాలను పాటించాలి. గ్యాస్ సిలిండర్ పైపు, పొయ్యి, రెగ్యులేటర్ ISI మార్క్ కలిగి ఉండాలి. గ్యాస్ ఉపయోగించే ప్రదేశంలో ఓపెన్ ఎలక్ట్రిక్ వైర్లు ఉండకూడదు. ప్రమాదం జరిగిన 30 రోజులలోపు గ్యాస్ సిలిండర్ స్టేషన్‌కు, పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి. క్లెయిమ్ కోసం ఎఫ్ఐఆర్ కాపీ, వైద్య బిల్లులు, హాస్పిటల్ రికార్డులు, మరణించిన సందర్భంలో పోస్ట్‌మార్టం నివేదిక వంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. బీమా మొత్తం గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో, వారికే లభిస్తుంది. ఇందులో నామినీని చేర్చే అవకాశం లేదు.
బీమాను ఎలా క్లెయిమ్ చేయాలి?
గ్యాస్ సిలిండర్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే, మీరు బీమా క్లెయిమ్ చేయాలనుకుంటే, మొదట మీ ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్, పోలీస్ స్టేషన్‌కు ప్రమాదం గురించి తెలియజేయాలి. తరువాత, బీమా కంపెనీ అధికారి గ్రౌండ్ విజిట్ చేసి తనిఖీ చేస్తారు. ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన తర్వాత, బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను ఆమోదిస్తుంది. దీని కోసం వినియోగదారుడు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు, డిస్ట్రిబ్యూటర్ ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ బీమా క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లోనూ చేయవచ్చు. దీని కోసం వినియోగదారులు mylpg.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.






















