RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్ - స్పెషల్ కేస్‌గా తెలంగాణ
Regional Rural Banks: గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుల వారికి రుణాలు అందించే లక్ష్యంతో, RRB చట్టం-1976 ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి.
Regional Rural Banks Consolidation: "వన్ స్టేట్-వన్ ఆర్‌ఆర్‌బీ" కార్యక్రమంలో భాగంగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (Regional Rural Banks/ RRBs) ఏకీకరణలో 4వ దశను ప్రారంభించింది. RRBల పనితీరును మెరుగుపరచడం, వ్యయాలను తగ్గించడం ఈ విలీన ప్రక్రియ లక్ష్యం. ఫలితంగా, దేశంలో ప్రస్తుతమున్న 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28కి తగ్గుతుంది. నాబార్డ్ (NABARD)తో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదింపుల తర్వాత, కేంద్ర ప్రభుత్వం RRBల విలీన నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ బ్యాంకుల విలీనం కోసం రోడ్‌మ్యాప్
ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) రూపొందించిన రోడ్‌మ్యాప్ ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం పని చేస్తున్న 15 ఆర్‌ఆర్‌బీలు విలీనం కానున్నాయి. మన దేశంలో, 2004-05లో 196 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3 దశల్లో జరిగిన విలీన ప్రక్రియతో 2020-21 నాటికి వాటి సంఖ్య 43కు తగ్గింది. ఇప్పుడు నాలుగో దశ ప్రారంభమైంది. ఫోర్త్ ఫేజ్ కూడా పూర్తయితే దేశవ్యాప్తంగా మిగిలే RRBలు 28కి పరిమితమవుతాయి.
ప్రభావితమయ్యే రాష్ట్రాలు - ఏపీపై ఎక్కువ ప్రభావం
ఆర్‌ఆర్‌బీల ఏకీకరణ వల్ల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh/ AP) ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే, APలో ప్రస్తుతమున్న 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు విలీనం అవుతాయి. ప్రస్తుతం, ఆంధప్రదేశ్‌లో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (స్పాన్పర్ బ్యాంక్ కెనరా బ్యాంక్), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ (స్పాన్పర్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (స్పాన్పర్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) - ఏపీ విభాగం (స్పాన్పర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉన్నాయి ఇకపై, కెనరా బ్యాంక్ స్పాన్సర్‌షిప్‌తో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పని చేస్తుంది.
మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే... ఉత్తర్‌ప్రదేశ్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 3, జమ్ము&కశ్మీర్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్‌లో 2 చొప్పున ఆర్‌ఆర్‌బీలు విలీనం కానున్నాయి.
ప్రత్యేక కేసుగా తెలంగాణ
RRBల విలీనం విషయంలో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక కేసుగా పరిగణనలోకి తీసుకుంది. ప్రస్తుతం, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) - తెలంగాణ విభాగం (స్పాన్సర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉన్నాయి. ఇకపై.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్‌షిప్‌తో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పని చేస్తుంది. APGVB-తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆస్తులు-అప్పుల విభజనకు' లోబడి RRBల విలీనం ఉంటుంది.
విలీన విషయంలో ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నవంబర్ 20లోగా చెప్పాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం RRBల స్పాన్సర్ బ్యాంక్‌లకు కోరింది.
ప్రస్తుతం, RRBల్లో కేంద్రానికి 50 శాతం వాటా ఉంది. 35 శాతం వాటా స్పాన్సర్ బ్యాంక్ దగ్గర, 15 శాతం వాటా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు, స్పాన్సర్ బ్యాంకుల నుంచి కాకుండా ఇతర వనరుల నుంచి మూలధనాన్ని సేకరించేందుకు RRBలకు బ్యాంకులకు అనుమతినిచ్చేలా RRB చట్టాన్ని 2015లో సవరించారు. ఈ సవరణ ద్వారా వాటా తగ్గింపు తర్వాత కూడా, కేంద్రం & స్పాన్సర్ చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ వాటా 51 శాతం కంటే తక్కువ ఉండకూడదు.
మరో ఆసక్తికర కథనం: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్ లేని స్కీమ్స్ ఇవి