Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Girl Kindap Case in Adilabad | బాలికను కిడ్నాప్ చేసి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని ఎస్సీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించారు.
Girl Kidnap in Adilabad District | గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికను యువకుడు కిడ్నాప్ చేసి తన ఇంట్లో దాడిపెట్టాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికను కిడ్నాప్ చేసి మధ్యాహ్నం నుంచి అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఆ ఇంటిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకని బాలికను రక్షించారు. అమ్మాయిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం యువకుడిని నిర్మల్ మీదుగా నిజామాబాద్ కు తరలించారు.
యువకుడిపై స్థానికులకు అనుమానం
గుడిహత్నూరులో స్థానిక యువకుడు ఓ బాలికను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకొచ్చి బంధించాడు. ఈ విషయం స్థానికులు గుర్తించారు. ఏదో తప్పు జరిగిందని ఆగ్రహించిన ఎస్సీ కాలనీ వాసులు యువకుడి ఇంటిని చుట్టూముట్టారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి ఇంటికి చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ ఆందోళనకు దిగిన వారు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు వారి వాహనాలు ధ్వంసం చేశారు. మరోవైపు యువకుడి ఇంటిపై సైతం రాళ్లు రువ్వారు. దీంతో గుడిహత్నూరు మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు ఎలాగోలా కష్టపడి యువడకుడి ఇంటి నుంచి మైనర్ బాలికను రక్షించారు. ఆ సమయంలో యువకుడు ఇంట్లో ఆపస్మారక స్థితిలో కనిపించాడు. ఇది గమనించిన ఎస్సీ కాలనీ వాసులు యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇంటిని చుట్టుముట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందుకు పోలీసులు నిరాకరించి, వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. యువకుడి ఇంటిపై రాళ్లు విసిరారు. పోలీసులపై, వారి వాహనాలపై సైతం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కొందరు పోలీసుల తలకు రాళ్లు తగిలి తీవ్ర గాయాలయ్యాయి.
కాలనీ వాసుల రాళ్ల దాడిలో పోలీసులకు గాయాలు
స్థానికుల దాడిలో గాయపడిన ఇచ్చోడ సిఐ, ఇచ్చోడ ఎస్ఐలను పోలీసులు స్థానిక రిమ్స్ కు తరలించారు. స్థానికుల దాడిలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు కట్టుదిట్టమైన భద్రత నడుమ బాలికను, యువకుడ్ని సైతం చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆదిలాబాద్ డీఎస్పి ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలికకు అక్కడే చికిత్స అందిస్తుండగా, యువకుడ్ని మెరుగైన వైద్యం కోసం నిర్మల్ మీదుగా నిజామాబాద్‌కు పోలీసులు తరలిస్తున్నట్లు సమాచారం.
ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలిసినా, అనుమానం వచ్చినా తమకు సమాచారం అందించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ప్రజలకు సూచించారు. పౌరులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు. బాలికలు, మహిళల రక్షణ కోసం నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై గుడిహత్నూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.