Cryptocurrency Crash: పడిపోయిన క్రిప్టో ధరలు.. దాదాపు అన్ని కాయిన్స్ నేల చూపులు, ఆ ప్రకటనతో అందరిలో ఆందోళన
నవంబరు 29 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021ను ప్రవేశపెట్టనున్నారు.
క్రిప్టో కరెన్సీలపై భారత ప్రభుత్వం తాజా నిర్ణయం వెలువరించిన వేళ డిజిటల్ కాయిన్ మార్కెట్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. క్రిప్టో కాయిన్ నియంత్రణ బిల్లును వచ్చే శీతకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే చాలా కాయిన్స్ పతనం ఆరంభమైంది. ప్రభుత్వం అన్ని ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను బ్యాన్, లేదా నియంత్రిస్తుందనే ఊహాగానాలు ఉన్న వేళ క్రిప్టో కాయిన్స్ గ్రాఫ్ నేల చూపులు చూసింది. నవంబర్ 23న రాత్రి 11:15 గంటల సమయానికి, అన్ని ప్రాథమిక క్రిప్టో కరెన్సీలు కనీసం 15 శాతం తగ్గుదలని నమోదు చేశాయి. బిట్ కాయిన్ 17 శాతం కంటే ఎక్కువ తగ్గింది. మరో ప్రధాన కాయిన్ ఎథిరియమ్ (Ethereum) 15 శాతం వరకూ తగ్గుదల నమోదు చేసింది.
భారత ప్రభుత్వ ప్రకటనతో సందిగ్ధం, ఆందోళనలో పడ్డ క్రిప్టో కాయిన్ ట్రేడర్లు ముందస్తు జాగ్రత్తగా కాయిన్స్‌పై తమ పెట్టుబడులను ఉప సంహరించుకుంటుండడంతో మార్కెట్లు పతనం అవుతున్నాయి.
నవంబరు 29 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021ను ప్రవేశపెట్టనున్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రైవేటు లేదా పర్సనల్ క్రిప్టో కరెన్సీలపై నియంత్రణకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అంతేకాక, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ పరిధిలో ఒక కొత్త డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే ఈ అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి ఒక సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కూడా రూపొందిస్తారు.
క్రిప్టో కొనుగోలుదారుల నగదు భద్రత, నిధులకు సంబంధించి మీడియాలో అనేక అనుమానాలతో కథనాలు, ఆందోళన కలిగించే వార్తలు ఎక్కువ అవుతుండడం పట్ల వర్చువల్ కరెన్సీల చట్టం గురించి మాట్లాడేందుకు పలువురు నిపుణులతో ప్రభుత్వం అనేక సమావేశాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలు మంత్రిత్వ శాఖలు, ఆర్‌బీఐకి చెందిన అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
Also Read: EPFO New Update: జాబ్ మారారా? పీఎఫ్ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!
Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ