Budget 2023: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందే భారత్ రైళ్లు, బడ్జెట్‌లో శుభవార్త వినే ఛాన్స్!
వచ్చే రెండేళ్లలో, దేశంలోని వివిధ మార్గాల్లో ఈ వెర్షన్‌కు చెందిన 400 రైళ్లను పట్టాల పైకి తీసుకురానున్నారు.
Budget 2023: 1924 నుంచి (బ్రిటిష్ పాలన కాలం నుంచి) కేంద్ర సాధారణ బడ్జెట్‌ను, రైల్వే బడ్జెట్‌ను విడివిడిగా పార్లమెంటులో ప్రవేశపెట్టేవాళ్లు. నీతి ఆయోగ్ సూచన తర్వాత, 2017లో ఆ సంప్రదాయానికి స్వస్థి పలికారు. 2017 నుంచి రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టడం ఆపేసి, కేంద్ర బడ్జెట్‌లో భాగంగా పార్లమెంటు ముందుకు తీసుకు వస్తున్నారు. అదే కోవలో, మరికొన్ని రోజుల్లో (2023 ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2023) భాగంగానే రైల్వే బడ్జెట్ కూడా ప్రవేశ పెడతారు.
రైల్వే బడ్జెట్‌లో, భారత రైల్వేలకు చేసిన కేటాయింపుల సమాచారం ఉంటుంది. రైల్వే స్టేషన్ల నుంచి కొత్త రైళ్ల వరకు, వాటిలో కొత్త సౌకర్యాలు కల్పించే ప్రకటనలు ఉంటాయి. వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలు పట్టాలెక్కిన నేపథ్యంలో, ఈసారి రైల్వే బడ్జెట్‌లో ఏయే ప్రకటనలు ఉండొచ్చు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ బడ్జెట్ మీద చాలా అంచనాలు ఉన్నాయి.
వందే భారత్ రైళ్లకు రూ.1800 కోట్లు
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) స్లీపర్ వెర్షన్ కోసం రైల్వే బడ్జెట్ నుంచి రూ. 1800 కోట్ల కేటాయింపులకు ఆమోదించారు. వచ్చే రెండేళ్లలో, దేశంలోని వివిధ మార్గాల్లో ఈ వెర్షన్‌కు చెందిన 400 రైళ్లను పట్టాల పైకి తీసుకురానున్నారు. ఈ రైళ్లను తయారు చేసేందుకు ఐసీఎఫ్‌తోపాటు చాలా కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. IANS (Indo Asian News Service) వార్తల ప్రకారం.. 400 రైళ్లలో, మొదటి 200 చైర్ కార్ రైళ్లు, మిగిలినవి స్లీపర్ వెర్షన్. చైర్ కార్ రైళ్లు గరిష్టంగా 180 కి.మీ. వేగంతో నడిచేలా డిజైన్ చేస్తారని, కానీ 130 కి.మీ. వేగంతో నడుపుతారని తెలుస్తోంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్‌లోని మిగిలిన 200 రైళ్లు గరిష్టంగా 220 కి.మీ. వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తారు, కానీ 200 కి.మీ. వేగంతో నడుపుతారు. నమ్మకమైన సమాచారం ప్రకారం.., రాబోయే రెండేళ్లలో మొత్తం 400 రైళ్లు దేశంలోని వివిధ రైల్వే మార్గాల్లో పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
శతాబ్ది, రాజధాని రైళ్ల స్థానంలో కొత్త రైళ్లు
వాస్తవానికి, ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వందే భారత్ చైర్ కార్ వెర్షన్‌ను; రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వందే భారత్ రైళ్ల వెర్షన్‌ను తీసుకొస్తున్నారు. రైల్వే వర్గాలు చెబుతున్న ప్రకారం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్ కోచ్‌లు అల్యూమినియంతో తయారు చేస్తారు, ఇది గంటకు గరిష్టంగా 220 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందిస్తారు. కాకపోతే, ప్రయాణం కోసం ఈ స్లీపర్ రైలును గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు.
తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్లు
ఈ ఏడాది చివరి నాటికి, దక్షిణ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వందే భారత్ రైళ్ల పరుగులు ప్రారంభం అవుతాయి. కొత్త రూట్లలో... తెలంగాణలోని కాచిగూడ - కర్ణాటకలోని బెంగళూరు తెలంగాణలోని సికింద్రాబాద్ - ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, మహారాష్ట్రలోని పుణె ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు దేశంలో ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఇవి నాగ్‌పుర్-బిలాస్‌పుర్, దిల్లీ-వారణాసి, దిల్లీ-కత్రా, దిల్లీ-ఉనా, గాంధీనగర్-ముంబై, చెన్నై-మైసూర్, హౌరా-న్యూ జల్‌పైగురి, సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లలో నడుస్తున్నాయి.
ALSO READ: బ్యాడ్ టైమ్ వెళ్లిపోతోందట, గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్