ఆరు సంవత్సరాల తర్వాత భారీ అప్‌డేట్: పూర్తిగా మారబోతున్న Suzuki Gixxer సిరీస్
Suzuki Gixxer 150, Gixxer 250 బైక్‌లకు నెక్ట్స్ జనరేషన్ అప్‌డేట్ రానుంది. కొత్త ప్లాట్‌ఫామ్, కొత్త లుక్, ఆధునిక ఫీచర్లతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Next Gen Suzuki Gixxer: భారత మార్కెట్‌లో 150cc నుంచి 250cc స్పోర్టీ కమ్యూటర్ బైక్‌ల సెగ్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా బాగా కాక మీద ఉంది. TVS, Bajaj, Yamaha వంటి కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ పోటీని బాగా పెంచాయి. అయితే, ఈ పోటీలో ఒకప్పుడు బలంగా వినిపించిన పేరైన Suzuki Gixxer సిరీస్ మాత్రం చాలా కాలంగా పెద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Suzuki Gixxer 150, Gixxer SF, Gixxer 250, Gixxer SF 250 మోడళ్లన్నీ 2019లో వచ్చిన డిజైన్, టెక్నాలజీతోనే కొనసాగుతున్నాయి. దాదాపు ఆరు సంవత్సరాలకుపైగా పెద్ద అప్‌డేట్ లేకపోవడంతో, ఈ బైక్‌ల అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు, Suzuki Motorcycle India కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కొత్త ప్లాట్‌ఫామ్‌పై పని
తాజా సమాచారం ప్రకారం.... Suzuki సంస్థ 150cc, 250cc Gixxer బైక్‌ల కోసం పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది కేవలం చిన్న మార్పులు కాదు, పూర్తి స్థాయి రీడిజైన్ చేయబోతోంది. 150cc మోడళ్లకు XF181, XF191, 250cc మోడళ్లకు XF1C1, XF1D1 అనే ఇంటర్నల్ ప్రాజెక్ట్ కోడ్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ నాలుగు మోడళ్లను ఒకేసారి లేదా చాలా తక్కువ గ్యాప్‌తోనే, 2026 చివరి త్రైమాసికంలో మార్కెట్‌లోకి తీసుకురావాలని Suzuki ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కొన్ని బైక్‌లు 2027 ప్రారంభంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
సుజుకీ కంపెనీకి Gixxer ఎందుకు కీలకం?
భారతదేశంలో Suzuki తయారు చేసే బైక్‌లలో Gixxer 150, Gixxer 250 సిరీస్, V-Strom SX మాత్రమే పూర్తిగా లోకల్ మాన్యుఫ్యాక్చర్ మోడళ్లు. అందుకే ఈ సెగ్మెంట్‌లో పోటీ ఇవ్వాలంటే Gixxer సిరీస్‌ను బలంగా ఉంచడం Suzukiకి చాలా అవసరం. మార్కెట్‌లో కొత్త టెక్నాలజీ, కొత్త ఫీచర్లతో బైక్‌లు వస్తున్న సమయంలో, Gixxer మోడళ్లు వెనుకబడిపోవడంతో ఇప్పుడు ఫుల్ స్కేల్ రీవ్యాంప్ చేయాలని కంపెనీ నిర్ణయించింది.
మెకానికల్ మార్పులు, కొత్త ఫీచర్లు
కొత్త Gixxer మోడళ్లలో చాసిస్, సస్పెన్షన్, ఓవరాల్ మెకానికల్ సెటప్‌లో పెద్ద మార్పులు ఉండే అవకాశం ఉంది. బజాజ్ తమ క్లాసిక్ పల్సర్‌లకు చేసినట్టే, Suzuki కూడా పూర్తిగా కొత్త అండర్‌పిన్నింగ్స్‌ను ఇవ్వవచ్చని అంచనా.
ఫీచర్ల విషయానికి వస్తే, ఇప్పటి సెగ్మెంట్ ప్రమాణాలకు తగ్గట్టుగా కలర్ LCD డిస్‌ప్లే, కొన్ని వేరియంట్లలో TFT స్క్రీన్, USD ఫోర్క్స్, మెరుగైన ఎలక్ట్రానిక్స్ వంటి అప్‌డేట్స్ రావచ్చు. ఇప్పటివరకు ఫీచర్ల విషయంలో పెద్దగా పేరు లేని Gixxer సిరీస్, ఈసారి గట్టిగా మెరుగుపడే అవకాశం ఉంది.
కొత్త లుక్ కూడా ఖాయం
డిజైన్ పరంగానూ కొత్త Gixxer బైక్‌లు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా Gixxer SF ఫెయిర్డ్ మోడళ్లు, Suzuki పెద్ద స్పోర్ట్ బైక్‌లు అయిన GSX-R సిరీస్ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకోవచ్చు.
లాంచ్ టైమ్‌లైన్
ఇప్పటికైతే అధికారిక లాంచ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. అయినప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం 2026 చివర్లో లేదా 2027 ప్రారంభంలో కొత్త తరం Suzuki Gixxer బైక్‌లు భారత మార్కెట్‌లోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తానికి, చాలా కాలంగా అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్న Gixxer అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. కొత్త ప్లాట్‌ఫామ్, కొత్త లుక్, ఆధునిక ఫీచర్లతో Suzuki Gixxer మళ్లీ తన పాత వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















