Kia Carens: కియా కారెన్స్ లాంచ్ అయ్యేది అప్పుడే.. మొదటి రోజు ఎన్ని బుక్ చేసుకున్నారంటే?
కియా కారెన్స్ మనదేశంలో ఫిబ్రవరిలో లాంచ్ కానుంది.
కియా నాలుగో ఉత్పత్తి మనదేశంలో లాంచ్ కావడానికి సిద్ధం అవుతోంది. అదే కియా కారెన్స్. ఈ కారు మనదేశంలో ఫిబ్రవరిలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇది మూడు వరుసల ఎంపీవీ కారు. కారెన్స్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ మనదేశంలో కొన్ని వారాల ముందే ప్రారంభం అయింది. మొదటిరోజే 7,738 కార్లను వినియోగదారులు బుక్ చేసుకున్నారు. ఇది నిజంగా పెద్ద నెంబరే. కియా కారెన్స్ ధర సెల్టోస్ కంటే ఎక్కువగా ఉండనుంది.
ఈ కారు బుకింగ్ అమౌంట్ రూ.25,000గా ఉంది. కియా ఇండియా వెబ్ సైట్ లేదా కియా డీలర్ షిప్ ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక సెవన్ సీటర్ కారు. ఇందులో మొత్తంగా ఐదు వేరియంట్లు ఉండనున్నాయి. టాప్ ఎండ్ ట్రిమ్‌లో ఆరు సీటర్ల వేరియంట్ కూడా ఉంది. ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇంపీరియల్ బ్లూ, మోస్ బ్రౌన్, స్పార్క్లింగ్ సిల్వర్, ఇంటెన్స్ రెడ్, అరోరా బ్లాక్ పెరల్, గ్రావిటీ గ్రే, క్లియర్ వైట్, గ్లేసియర్ పెరల్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఇందులో రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ల పెట్రోల్ యూనిట్, 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ యూనిట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ యూనిట్ 113 బీహెచ్‌పీ, 144 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో కేవలం సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఇక 1.4 లీటర్ టర్బోచార్జ్‌డ్ వేరియంట్ 138 బీహెచ్‌పీ, 242 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్, ప్యాడిల్ షిఫ్టర్లు ఉండనున్నాయి. దీంతోపాటు ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉండనుంది. ఇందులో సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు ఉండనున్నాయి. ఈ కారు 113 బీహెచ్‌పీ, 250 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది.
కియా కారెన్స్‌లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఉండనుంది. దీంతోపాటు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ ఏసీ, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్, బోస్ సౌండ్ సిస్టం, ఎలక్ట్రిక్ డబుల్ ఫోల్డింగ్ సెకండ్ రో సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
దీంతోపాటు ఆరు ఎయిర్ బాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హైలైన్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కార్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు డిస్క్ బ్రేకులు, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రివర్సింగ్ కెమెరా కూడా ఇందులో ఉండనుంది.