Kia Carens Clavis EV రియల్ వరల్డ్ రేంజ్ టెస్టింగ్ - సిటీలో, హైవేలో ఎంత ఇస్తుందంటే?
కియా కారెన్స్ క్లావిస్ EV రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్ ఫలితాలు వెల్లడయ్యాయి. సిటీలో, హైవేలో, సగటున ఎంత దూరం ప్రయాణించగలదో, ఛార్జింగ్ పనితీరు ఎలా ఉందో పూర్తి వివరాలు ఇవిగో.

Kia Carens Clavis EV Real Range Test: ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో కియా తన అడుగులను మరింత బలంగా వేస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సెగ్మెంట్లలో మంచి పేరు సంపాదించిన కియా... కారెన్స్ క్లావిస్ EVతోనూ ఎలక్ట్రిక్ MPV విభాగంలో ఆసక్తిని పెంచుతోంది. అయితే, చాలామంది కొనుగోలుదారులకు ఉండే ప్రధాన ప్రశ్న ఒక్కటే – “కంపెనీ చెప్పే రేంజ్ నిజంగా వస్తుందా?” అనే విషయం. ఈ ప్రశ్నకు సమాధానంగా, ఆటో ఎక్స్‌పర్ట్స్‌లు, కారెన్స్ క్లావిస్ EVను నిజమైన రోడ్డు పరిస్థితుల్లో పరీక్షించారు.
బ్యాటరీ ఆప్షన్లు, ధరలు
కియా కారెన్స్ క్లావిస్ EV రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి 42kWh బ్యాటరీ, మరొకటి 51.4kWh బ్యాటరీ. ఈ రెండు కూడా నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (NMC) సెల్ కెమిస్ట్రీతో కూడిన లిథియమ్-అయాన్ బ్యాటరీలు.
42kWh బ్యాటరీ ఉన్న వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.17.99 లక్షల నుంచి రూ.20.49 లక్షల వరకు ఉంది. పెద్ద బ్యాటరీ కలిగిన 51.4kWh వేరియంట్ల ధరలు రూ.21.99 లక్షల నుంచి రూ.24.49 లక్షల వరకు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ ఉన్న ఎక్స్‌టెండెడ్ రేంజ్ (ER) వేరియంట్‌ను ఈ టెస్ట్ కోసం ఉపయోగించారు.
డ్రైవ్ మోడ్స్, రీజనరేటివ్ బ్రేకింగ్
కారెన్స్ క్లావిస్ EVలో Eco, Normal, Sport అనే మూడు డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. అంతేకాదు, ఇందులో 5-లెవెల్స్ రీజనరేటివ్ బ్రేకింగ్ అందుబాటులో ఉంది. Level 0 నుంచి సింగిల్ పెడల్ డ్రైవింగ్ వరకు, డ్రైవర్ అవసరాన్ని బట్టి ఎంచుకునే అవకాశం ఉంది. టాప్ స్పెక్ వేరియంట్ బరువు సుమారు 1,725 కిలోలుగా ఉంటుంది.
రియల్ వరల్డ్ రేంజ్ ఫలితాలు
51.4kWh బ్యాటరీతో వచ్చే కారెన్స్ క్లావిస్ EV... ముందు చక్రాలను నడిపే 171 hp శక్తి, 255 Nm టార్క్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తోంది. కంపెనీ క్లెయిమ్ చేసిన ప్రకారం, ఈ కారు ఒక్క ఛార్జ్‌తో 490 కిలోమీటర్లు (ARAI సర్టిఫై చేసిన రేంజ్) ప్రయాణించగలదు.
అయితే, రియల్ వరల్డ్ టెస్ట్‌లో ఫలితాలు ఇలా ఉన్నాయి:
సిటీలో – 383 కిలోమీటర్లు
హైవే మీద – 345 కిలోమీటర్లు
సగటున – 364 కిలోమీటర్లు
టెస్ట్ సమయంలో ఎక్స్‌పర్ట్‌లు ఈ కారును Eco మోడ్‌లో, ఎయిర్ కండిషనర్‌ను 22 డిగ్రీల సెల్సియస్, ఫుల్ ఆటో మోడ్‌లో ఉంచారు. సిటీలో రీజనరేషన్ Level 3గా, హైవేలో Level 2గా సెట్ చేశారు. ఈ పరిస్థితుల్లో సిటీలో 7.45 కి.మీ/kWh, హైవేలో 6.71 కి.మీ/kWh ఎఫిషియెన్సీ వచ్చింది. దీని ఆధారంగా కలిపి సగటు రేంజ్ సుమారు 364 కిలోమీటర్లుగా లెక్క తేలింది.
ఇంకొక ఆసక్తికరమైన ఫీచర్ ‘Driver-only’ క్లైమేట్ మోడ్. ఇది ఎయిర్‌కండిషనింగ్ లోడ్‌ను తగ్గించి, అవసరమైతే రేంజ్‌ను ఇంకా పెంచే అవకాశాన్ని ఇస్తుంది.
ఛార్జింగ్ పనితీరు
ఛార్జింగ్ విషయంలో కారెన్స్ క్లావిస్ EV ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. 60kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీని 20 శాతం నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 27 నిమిషాలు పట్టింది. ఈ సమయంలో సుమారు 16.5kWh విద్యుత్ వినియోగం జరిగింది. సగటు ఛార్జింగ్ వేగం దాదాపు 42kWగా నమోదైంది. ఈ ధర శ్రేణిలో ఉన్న కొన్ని ప్రత్యర్థి కార్లతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ వేగమే.
మొత్తంగా ఎలా ఉంది?
కియా కారెన్స్ క్లావిస్ EV రియల్ వరల్డ్ రేంజ్ ఫలితాలు ప్రాక్టికల్‌గా అనిపిస్తున్నాయి. కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్‌తో పోలిస్తే చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, రోజువారీ నగర ప్రయాణాలు, అప్పుడప్పుడు హైవే ట్రిప్స్‌కు ఇది సరిపడా సామర్థ్యాన్ని చూపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















