2026లో Nissan దూకుడు: Gravite MPV, Tekton SUVతో మన మార్కెట్‌పై ఫోకస్
ఐదేళ్ల విరామం తర్వాత, నిస్సాన్, మన మార్కెట్‌లో దూకుడు పెంచుతోంది. 2026లో గ్రావైట్ MPV, టెక్టన్ మిడ్‌సైజ్ SUV లాంచ్‌కు సిద్ధమవుతోంది. ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Upcoming Nissan Cars 2026: ఇండియా మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా నిస్సాన్ పేరు పెద్దగా వినిపించలేదు. ఒక్క మాగ్నైట్ మోడల్‌పైనే ఆధారపడుతూ ఈ కంపెనీ చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉంది. అయితే ఆ నిశ్శబ్దానికి 2026లో ముగింపు పలకాలని నిస్సాన్ గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి ఇండియా మార్కెట్‌లో అత్యంత దూకుడైన ప్రొడక్ట్ ప్లాన్‌ను అమలు చేయడానికి నిస్సాన్ సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఒక్క కారుతో ఉన్న నిస్సాన్ పోర్ట్‌ఫోలియోను 2026 చివరి నాటికి మూడు మోడల్స్‌కు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు, 2027లో మరో కొత్త మోడల్‌ను కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే 2026లో రెండు కీలక లాంచ్‌లు జరగనున్నాయి. అవే – నిస్సాన్ గ్రావైట్ (కాంపాక్ట్ MPV), నిస్సాన్ టెక్టన్ (మిడ్‌సైజ్ SUV).
Nissan Gravite – ట్రైబర్ ఆధారంగా కొత్త MPV
2026లో నిస్సాన్ లాంచ్ చేసే తొలి కారు గ్రావైట్. ఇది రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా రూపొందిన కాంపాక్ట్ MPV. 2026 జనవరిలో ఈ కారును అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంది. ధరలను మాత్రం మార్చి 2026లో ప్రకటించనున్నారు.
డిజైన్ పరంగా, ట్రైబర్‌తో పోలిస్తే గ్రావైట్‌లో కొన్ని స్పష్టమైన మార్పులు ఉంటాయి. కొత్త బంపర్లు, భిన్నమైన లైటింగ్ సిగ్నేచర్, కొత్త అలాయ్ వీల్స్‌తో ఇది మరింత ఫ్రెష్‌గా కనిపించనుంది. లోపల కూడా కొత్త ట్రిమ్, కొత్త కలర్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఫీచర్ల లిస్ట్ మాత్రం ఎక్కువగా ట్రైబర్‌లాగే ఉండనుంది.
ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారు 72 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.
నిస్సాన్ గ్రావైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల మధ్య ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫ్యామిలీ వినియోగం, నగర ప్రయాణాలకు ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.
Nissan Tekton – క్రెటా సెగ్మెంట్‌లోకి ఎంట్రీ
గ్రావైట్ తర్వాత నిస్సాన్ లాంచ్ చేయనున్న అత్యంత కీలక మోడల్ టెక్టన్. ఇది రెనాల్ట్ కొత్త డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించే మిడ్‌సైజ్ SUV. 2026 రెండో భాగంలో, అంటే జూన్ నుంచి డిసెంబర్ కాలంలో ఈ SUV ఇండియా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా టెక్టన్ చాలా అగ్రెసివ్‌గా ఉండనుందని సమాచారం. నిస్సాన్ ఫ్లాగ్‌షిప్ SUV పట్రోల్ నుంచి ప్రేరణ పొందిన గ్రిల్, షార్ప్ క్యారెక్టర్ లైన్స్, C-షేప్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి పాపులర్ SUVలకు నేరుగా పోటీ ఇవ్వనుంది.
ఈ కారులో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. ఇది రెనాల్ట్ డస్టర్‌తో షేర్ అయ్యే యూనిట్. భవిష్యత్తులో హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కూడా నిస్సాన్ తీసుకురావచ్చని సమాచారం.
నిస్సాన్ టెక్టన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.11 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ఇండియా మార్కెట్‌పై నిస్సాన్ కొత్త ఆశలు
ఈ రెండు లాంచ్‌లతో నిస్సాన్, ఇండియా మార్కెట్‌లో మళ్లీ బలంగా నిలదొక్కుకోవాలని చూస్తోంది. MPV, మిడ్‌సైజ్ SUV వంటి అధిక డిమాండ్ ఉన్న సెగ్మెంట్లలోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా అమ్మకాలను పెంచుకోవడమే కంపెనీ లక్ష్యం. 2026 నిస్సాన్‌కు నిజంగా కీలక సంవత్సరం కానుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















