₹1.5 లక్షల బడ్జెట్‌లో పవర్, కంఫర్ట్, నమ్మకం - 45 ఏళ్లు పైబడినవారికి సరైన స్కూటర్ ఏదంటే?
రోజూ 15–20 కి.మీ. నగర ప్రయాణానికి శక్తిమంతమైన, నమ్మకమైన స్కూటర్ కావాలా? ₹1.5 లక్షల లోపు TVS Ntorq 150, Jupiter 125, Access 125, Activa 125తో పాటు ఇతర బెస్ట్ ఆప్షన్ల పూర్తి వివరాలు.

Reliable Scooter For People Over 45 Years Of Age: 45-50 వయస్సులో ఉండి, ప్రతిరోజూ 15 నుంచి 20 కి.మీ. ప్రయాణం చేసేందుకు స్కూటర్ ఎంచుకుంటున్నారా?. ఇలాంటి సందర్భంలో స్కూటర్ కొనేటప్పుడు పవర్, కంఫర్ట్, నమ్మకం, దీర్ఘకాలిక ఉపయోగం ముఖ్యంగా చూడాలి. TVS Ntorq 150, Jupiter 125, Access 125, Activa 125 ను పరిశీలించవచ్చు. ఇవి ₹1.5 లక్షల లోపు వస్తాయి.
ముందుగా TVS Ntorq 150 గురించి మాట్లాడుకుంటే… ఇది అత్యంత శక్తిమంతమైన స్కూటర్. పెద్ద బాడీ, అగ్రెసివ్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ దీనికి ప్లస్. నగరంలో ఓవర్‌టేకింగ్, ఫ్లైఓవర్‌లపై ఎక్కేటప్పుడు పవర్ తగ్గినట్లు అనిపించదు. TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్‌లు లాంటి దీని ఫీచర్లు... టెక్నాలజీని ఇష్టపడే వారికి బాగా నచ్చుతాయి. అయితే సస్పెన్షన్ కాస్త స్టిఫ్‌గా ఉంటుంది. స్పోర్టీ రైడ్ కావాలంటే ఇది సరైన ఎంపిక.
TVS Jupiter 125 పూర్తిగా ప్రాక్టికల్ స్కూటర్. సాఫ్ట్ సస్పెన్షన్, కంఫర్ట్ సీటింగ్ పొజిషన్ వల్ల రోజూ ఆఫీస్ లేదా బిజినెస్ పనిపై తిరిగేవాళ్లకు ఇది చాలా అనుకూలం. ముఖ్యంగా 33 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ కుటుంబ వినియోగంలో పెద్ద ప్లస్. నడుము, మోకాళ్లపై ఒత్తిడి తక్కువగా ఉండేలా ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. పవర్ పరంగా ఇది స్పోర్టీ కాదు, కానీ సిటీలో వాడుకోవడానికి చక్కగా సరిపోతుంది.
Suzuki Access 125 అంటేనే నమ్మకం. ఈ స్కూటర్ చాలా ఏళ్లుగా మార్కెట్లో ఉంది. పెప్పీ పికప్, స్మూత్ ఇంజిన్, మంచి మైలేజ్ దీని బలం. దీర్ఘకాలిక వినియోగంలో మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. కుటుంబంతో పాటు రోజూ ఆఫీస్ ప్రయాణానికి ఇది సేఫ్ ఛాయిస్.
Honda Activa 125 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఒక్క ఫీచర్ ఎక్కువగా కనిపించకపోయినా, మొత్తం ప్యాకేజ్ మాత్రం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఇంజిన్ స్మూత్‌గా పని చేస్తుంది. హోండా నమ్మకం, రీసేల్ విలువ, సర్వీస్ నెట్‌వర్క్ దీనిని ఇంకా బలంగా నిలబెడతాయి. “టెన్షన్ లేకుండా వాడాలి” అనుకునేవారికి ఇది సరైన ఎంపిక.
ఇవే కాకుండా, మీరు, Yamaha Aerox 155 ని కూడా పరిశీలించొచ్చు. ఇది స్కూటర్ కంటే బైక్ ఫీల్ ఎక్కువ ఇస్తుంది. పవర్ చాలా బాగుంటుంది. కానీ సీటింగ్ కాస్త హార్డ్‌గా ఉంటుంది. కుటుంబ వినియోగానికి అంత అనుకూలం కాదు. స్పోర్టీ రైడ్ ఇష్టపడితే మాత్రమే చూడాలి.
పవర్ & ఫన్ రైడ్ కావాలంటే – TVS Ntorq 150
కంఫర్ట్, స్టోరేజ్, ఫ్యామిలీ యూజ్ కావాలంటే – TVS Jupiter 125
నమ్మకం, మైలేజ్, దీర్ఘకాలిక వినియోగం కావాలంటే – Suzuki Access 125 లేదా Honda Activa 125
మీరు ఏ స్కూటర్ తీసుకున్నా, ఒక సూచన… తప్పకుండా టెస్ట్ రైడ్ చేయండి. మీ శరీరానికి ఏది సూట్ అవుతుందో, ఏ స్కూటర్‌పై కంఫర్ట్‌గా ఉన్నారో అదే మీకు బెస్ట్ స్కూటర్ అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















