Ioniq 5 EV : హ్యుందాయ్ ఎలక్ట్రిక్ SUV ఐయోనిక్ 5 భారత్ లో లాంచ్ ఈ ఏడాదే, ఫీచర్స్ అదుర్స్
Ioniq 5 EV : ఈ ఏడాది హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు ఐయోనిక్ 5 దేశంలో లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఐయోనిక్ 5 - 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.
Ioniq 5 EV : హ్యుందాయ్ ఇండియాలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని యోచిస్తోంది. హ్యుందాయ్ నూతన ఎలక్ట్రిక్ కార్లలో మొదటిగా Ioniq 5 ఎలక్ట్రిక్ SUV తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎలక్ట్రిక్ ప్రీమియం SUV అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. Ioniq 5 ఎలక్ట్రిక్ కార్ల ఫీచర్లు హ్యుందాయ్ తెలిపింది. Ioniq 5 హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లు కొత్త E-GMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి రూపొందించినవి. ఈ టెక్నాలజీతో పెట్రోల్, డీజిల్ కార్లతో ఎటువంటి సంబంధం ఉండదని పేర్కొంది. ఇది ఒక పెద్ద SUV అయితే ఇందులో ఆసక్తికరమైన క్రాస్ఓవర్ షేప్ నిర్మిస్తున్నారు. ముఖ్యంగా పిక్సలేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు DRLలను కలిగి ఉంటాయి. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 20 అంగుళాల వీల్స్ కూడా ఉన్నాయి.
పర్యావరణ హిత ఇంటీరియర్
ఇతర హ్యుందాయ్ కార్ల కన్నా భిన్నమైన ఇంటీరియల్ డిజైన్ దీని ప్రత్యేకతగా హ్యుందాయ్ చెబుతోంది. కారు లెగ్‌రూమ్ ఎక్కువగా ఉండేందుకు ఫ్లాట్ ఫ్లోర్‌ను కలిగి ఉంది. 3,000 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. సెంటర్ కన్సోల్ ముందుకు, వెనుకకు కదిలేందుకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది. కారు ఇంటీరియర్‌ను ఎక్కువ భాగం PET బాటిల్స్, మొక్కల ఆధారిత యార్న్, సహజమైన ఉన్ని, మొక్కల ఆధారిత పర్యావరణ-ప్రాసెస్ చేసిన వాటితో రూపొందించారు. పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించామని హ్యుందాయ్ వెల్లడించింది.
500 కి.మీ వరకు
Ioniq 5 AWD లేదా రేర్ మోటారుతో 58 kWh లేదా 72.6 kWh బ్యాటరీ ప్యాక్‌లతో అందుబాటులోకి రానుంది. రేర్ మోటారు 500 కి.మీ పరిధి వరకు అందించగలదు. Ioniq 5 సాధారణ ఫాస్ట్ AC/DC ఛార్జర్‌లతో పాటు వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా కలిగి ఉంది. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లేని పొందిన మొదటి హ్యుందాయ్ కారు. Ioniq 5 ప్రీమియం ప్రొడెక్ట్. దీని ధర సుమారు రూ. 40 లక్షలుగా అంచనా వేస్తున్నారు.
వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్
హ్యుందాయ్ బియాండ్ మొబిలిటీ స్ట్రాటజీ కింద 2022 ద్వితీయార్థంలో ఇండియాలో ఆల్-ఎలక్ట్రిక్ ఐయోనిక్ 5ని విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కొరియన్ కార్‌మేకర్ భారతదేశంలో తన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని 2028 నాటికి ఆరు మోడళ్లకు విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. Ioniq 5 - 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 2022లో దీనిని భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది.